బీఆర్‌ఎస్, కర్ణాటక కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు సంబంధించిన ఫేక్ వీడియోపై భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్), కర్ణాటక కాంగ్రెస్ నాయకుల మధ్య మాటల యుద్ధం బుధవారం కొనసాగింది.

By అంజి  Published on  20 Dec 2023 6:37 AM GMT
BRS, Karnataka Congress leaders, Telangana, KTR

బీఆర్‌ఎస్, కర్ణాటక కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు సంబంధించిన ఫేక్ వీడియోపై భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్), కర్ణాటక కాంగ్రెస్ నాయకుల మధ్య మాటల యుద్ధం బుధవారం కొనసాగింది. అయితే కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే ఈ అంశంలో తలదూర్చారు. దీనికి కేటీఆర్‌ గట్టి కౌంటర్ ఇచ్చారు. కర్ణాటక అసెంబ్లీలో సిద్ధరామయ్య ప్రసంగానికి సంబంధించిన ఫేక్ వీడియో క్లిప్‌ను షేర్ చేసినందుకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌పై కర్ణాటక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ మంత్రి ప్రియాంక్‌ ఖర్గే ఎక్స్‌లో తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

''అబద్ధాలు, అవకతవకల విషయంలో కేటీఆర్‌ కూడా బీజేపీని అనుసరిన్నట్లుగా కనిపిస్తున్నది. బీజేపీ, బీఆర్‌ఎస్‌ తోడుదొంగలుగా మారినందున ఇలాంటి అబద్ధపు ప్రచారాలు వారికి నిత్యకృత్యంగా మారుతాయనడంలో సందేహం లేదు. ఇలాంటి తప్పుడు ప్రచారాలను, వార్తలను తిప్పికొట్టడానికే కర్ణాటక ప్రభుత్వం ఒక ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేయబోతున్నది'' అని ప్రియాంక్‌ ఖర్గే అన్నారు.

ఖర్గే దాడికి కౌంటర్ ఇచ్చిన కేటీఆర్, కొన్ని వార్తాపత్రిక క్లిప్పింగ్‌లను పోస్ట్ చేస్తూ, “2 లక్షల మంది కర్ణాటక యువతకు ఉపాధి గురించి మీ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన ప్రకటనలు, ఖాళీ ఖజానాపై డిప్యూటీ సీఎం చేసిన ప్రకటనలు కూడా నకిలీవా?” అని ప్రశ్నించారు. ‘దోస్తూ.. తెలంగాణలో ముగ్గురు ఎంపీలు సహా బీజేపీ పెద్ద తలకాయలన్నింటిని ఓడించింది మేమే. కాంగ్రెస్‌ పార్టీ కాదు. సునీల్ అండ్‌ టీమ్‌ ప్రచారంపట్ల మీరు జాగ్రత్తగా ఉండటం మంచిది’ అని సూచించారు.

మంగళవారం బీఆర్‌ఎస్‌ నాయకుడు కర్ణాటక ముఖ్యమంత్రి ప్రసంగానికి సంబంధించిన వీడియోను షేర్ చేసి, “పోల్ వాగ్దానాలు/హామీలను అందించడానికి డబ్బు లేదని కర్ణాటక సీఎం చెప్పారు!” అని వ్రాసిన తర్వాత కేటీఆర్‌, సిద్ధరామయ్య మధ్య మాటల యుద్ధం జరిగింది. ఖజానాలో డబ్బు లేదంటూ ఎన్నికల హామీలపై కర్ణాటక కాంగ్రెస్‌ ప్రభుత్వం చేతులెత్తేసిందని, తెలంగాణ ప్రజల భవిష్యత్తు కూడా ఇలాగే ఉండబోతున్నదా..? అంటూ ట్వీట్‌ చేశారు.

‘ఎన్నికల్లో ఓట్లకోసం ఏదో అన్నాం. అది ఇస్తాం.. ఇది ఇస్తాం అంటాం. అంత మాత్రాన అన్నీ ఫ్రీగా ఇవ్వా లా..? మాకు ఇవ్వాలనే ఉన్నది. కానీ ఖజానాలో డబ్బులు లేవు’ అని సిద్ధరామయ్య అసెంబ్లీలో పేర్కొన్నట్టుగా ఉన్న వీడియోను కేటీఆర్‌ పోస్టు చేస్తూ పై సందేహాలు వెలిబుచ్చారు. పార్లమెంటు ఎన్నికల తరువాత తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కూడా ఇలాంటి ప్రకటనే చేయనున్నారా..? అనే సందేహం కూడా వ్యక్తంచేశారు.

అయితే ఫేక్ వీడియోను సర్క్యులేట్ చేస్తున్నారని కేటీఆర్‌పై సిద్ధరామయ్య తిప్పికొట్టారు. ‘‘తెలంగాణ ఎన్నికల్లో మీ పార్టీ ఎందుకు అధికారాన్ని కోల్పోయిందో తెలుసా? ఎందుకంటే ఏది ఫేక్, ఎడిట్, ఏది నిజం అని వెరిఫై చేయడం కూడా మీకు తెలియదు” అని కర్ణాటక ముఖ్యమంత్రి బీఆర్‌ఎస్ నేతకు కౌంటర్‌ ఇచ్చారు.

బీజేపీ ఫేక్ ఎడిటెడ్ వీడియోలను సృష్టిస్తుందని, బీఆర్‌ఎస్ వాటిని సర్క్యులేట్ చేస్తోందని కాంగ్రెస్ నేత పేర్కొన్నారు. “మీది బీజేపీకి చెందిన పర్ఫెక్ట్ బి టీమ్. మీకు ఇంకా వాస్తవాలపై ఆసక్తి ఉంటే, దీన్ని చదవండి" అని సిద్ధరామయ్య రాశారు, కొంతమంది బిజెపి నాయకులు ఎడిట్ చేసిన వీడియో గురించి తన ప్రకటన యొక్క లింక్‌ను పంచుకున్నారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మరో నిప్పులు చెరిగారు. మీ పార్టీ తెలంగాణ ప్రజలను బూటకపు వాగ్దానాలతో తప్పుదోవ పట్టించినందుకే ఎన్నికల్లో ఓడిపోయామని కేటీఆర్‌ అన్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ హామీలను 2023 డిసెంబర్ 9 నాటికి అమలు చేస్తామని హామీ ఇచ్చినా ఎందుకు నెరవేర్చలేదని కేటీఆర్ ప్రశ్నించారు.

Next Story