ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ప్రారంభించిన పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాయని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మంగళవారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన అనంతరం మంత్రి మాట్లాడుతూ.. పల్లె ప్రగతితో గ్రామీణ ప్రాంతాల్లో పెనుమార్పులు వచ్చాయని అన్నారు. గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడంతో పాటు పచ్చదనం, పారిశుధ్యం పెంపొందించేందుకు చర్యలు చేపట్టామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతుబంధు, రైతుబీమా, దళిత బంధు, కేసీఆర్ కిట్‌లు, 24 గంటల ఉచిత విద్యుత్తు తదితర వినూత్న కార్యక్రమాలను ప్రవేశపెట్టి దేశానికే ఆదర్శంగా నిలిచామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుంటే, కేంద్రం తన విధానాలతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని, వంటగ్యాస్ సిలిండర్లు, పెట్రోల్, డీజిల్ ధరలను ఇంత అసాధారణంగా పెంచడం గతంలో ఎన్నడూ చూడలేదన్నారు. ప్రజల కొనుగోలు సామర్థ్యం తగ్గిపోతోందని, కేంద్ర ప్రభుత్వం తన విధానాలను మార్చుకోవాలని సూచించారు. సాయన్నపేటలో పాఠశాల భవనం, బొమ్మారెడ్డిపల్లిలో సీసీ రోడ్లు, కమ్యూనిటీ భవనానికి మంత్రి శంకుస్థాపన చేశారు.