నల్గొండ జిల్లాలోని నక్రేకల్ మండలం చందుపట్ల గ్రామ ప్రజలకు ఊహించని భయం వెంటాడుతూ ఉంది. కులమతాలకు అతీతంగా భయపడుతూ ఉన్నారు జనం. చందుపట్ల ప్రజలు బుధవారం నాడు ఊరికి దూరంగా చెట్ల కింద రోజంతా గడిపేందుకు ఇళ్ల నుంచి వెళ్లిపోయారు.
గ్రామ పెద్దల నిర్ణయం మేరకు ఇళ్లు వదిలి తెల్లవారుజాము నుండి సాయంత్రం వరకూ చెట్ల కిందే గడిపారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు గ్రామమంతా నిర్మానుష్యంగా కనిపించింది. జనవరి 21 నుండి గ్రామంలో అనారోగ్య సమస్యలతో ఏకంగా 12 మంది మరణించడంతో ఆ గ్రామ ప్రజలను భయం వెంటాడుతూ వచ్చింది.
11 రోజుల్లో 12 మంది మృతి చెందడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. చందుపట్ల గ్రామ పెద్దలు అందరినీ పిలిపించి సమావేశం నిర్వహించారు. గ్రామంలో ఏదో జరుగుతోందని.. ఊరిని చెడు నుంచి కాపాడేందుకు గ్రామప్రజలు ఒకరోజు ఇళ్లను వదిలి వెళ్లాలని నిర్ణయించారు. ప్రజలు తమ ఇళ్ల నుండి బయలుదేరే ముందు ఉదయం సమయంలో గొర్రెలు, కోళ్లను కూడా బలి ఇచ్చారు. గ్రామస్తులు ఇళ్ల నుంచి బయటకు వచ్చిన తర్వాత ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎవరూ గ్రామంలోకి రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు.