ఆ గ్రామానికి దెయ్యం భయం పట్టుకుంది. ఎవరో భూత వైద్యుడు.. ఊరికి దెయ్యం పట్టిందని చెప్పడంతో అక్కడ ప్రజలు ఒకే రోజంతా ఊరిని ఖాళీ చేశారు. ఇది మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం పాటిమీది గూడెంలో జరిగింది. గత కొన్ని రోజులుగా వివిధ కారణాలతో పాటిమీదిగూడెంలో 8 మంది చనిపోయారు. కొన్ని రోజుల తేడాతో ఇలా వరుస పెట్టి 8 మంది చనిపోవడంతో ఆ గ్రామస్థుల్లో భయాందోళనలు కలిగాయి. విషయం తెలుసుకున్న ఓ భూత వైద్యుడు.. గ్రామానికి దెయ్యం పట్టిందని, గ్రామంలో రోజు దెయ్యం తిరుగుతోందని ఊరి వాళ్లని నమ్మించాడు.
ఒకరోజంతా గ్రామ ప్రజలు ఊరును ఖాళీ చేసి వెళ్లిపోవాలని చెప్పాడు. దీంతో ఆ గ్రామస్తులు ఒకరోజు పాటు గ్రామాన్ని వీడారు. ఈ విషయం కాస్తా మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ దృష్టికి వెళ్లింది. ఈ విషయంపై శంకర్ నాయక్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వెంటనే పాటమీదిగూడెం గ్రామంలో ఆయన పర్యటించారు. ఆ గ్రామంలోని పరిస్థితులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాట్లాడుతూ.. ఇక్కడ సారానే అసలు దెయ్యమని, అది తాగడం మానేస్తే పరిస్థితులు చక్కబడతాయని గ్రామస్తులకు వివరించారు.