సినీనటి, కాంగ్రెస్ మహిళా నేత విజయశాంతి బీజేపీలో చేరారు. దుబ్బాక ఉపఎన్నిక ప్రచారం మొదలైనప్పటి నుండి ఆమె బీజేపీలో చేరుతున్నారనే వార్తలు పెద్ద ఎత్తున రాగా.. ఆ వార్తలను ఆమె ఒక్కసారి కూడా ఖండించలేదు. రెండ్రోజులుగా ఢిల్లీలో బీజేపీ నేతలతో చర్చలు జరిపిన రాములమ్మ.. చివరికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు.
విజయశాంతికి కాషాయ కండువా కప్పిన ఆయన.. పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. తెలంగాణలో కష్టాల్లో ఉన్న కాంగ్రెస్‌కు విజయశాంతి పార్టీ మారడం ఒకింత షాకే అని చెప్పుకోవచ్చు. ఇదిలావుంటే.. తెలంగాణలో అధికారమే ధ్యేయంగా పనిచేస్తున్న బీజేపీ ఇప్పుడు 'ఆపరేషన్ ఆకర్ష్'కు తెరతీసింది. ఇప్పటికే టీఆర్‌ఎస్ నుంచి స్వామిగౌడ్ బీజేపీలో చేరగా.. విజయశాంతి కూడా తాజాగా కాషాయ కండువా కప్పేసుకున్నారు. నిన్న కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో పాటు ఇతర పెద్దలను కలిసిన ఆమె నేడు పార్టీలో చేరారు.