అలా చేసి సర్కార్ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు నిరాశను మిగిల్చింది
Vijayashanti Fires On CM KCR. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగితే పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలు, ఆర్థికంగా వెనుక బడిన
By Medi Samrat Published on 23 Sept 2021 10:05 AMతెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగితే పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలు, ఆర్థికంగా వెనుక బడిన కులాలవారికి న్యాయం జరుగుతుందని కాంక్షించి ఉద్యమంలో తమ వంతు పాత్ర పోషించిన వారికి నేడు టీఆర్ఎస్ దొరల సర్కార్ పాలనలో ఏ ఉపయోగం లేకపోయిందని బీజేపీ నాయకురాలు విజయశాంతి అన్నారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామని ప్రకటించి గద్దెనెక్కారు. కానీ.. ఈ ఏడేండ్ల కాలంలో కేజీ టు పీజీ విద్య ఎక్కడా అమలు చేయలేదు. రాష్ట్రంలో విద్యారంగాన్ని సమీక్షించాలనే విషయాన్ని సీఎం కేసీఆర్ పూర్తిగా మరిచిపోయారని ఆమె అన్నారు.
రాష్ట్రంలో గురుకులాలు నెలకొల్పి విద్యనందిస్తున్నాం.. ప్రతి పిల్లవాని మీద ఏటా లక్ష 32 వేల రూపాయలు ఖర్చు చేస్తున్నామని ప్రభుత్వం గప్పాలు చెబుతుంది.. అయితే గురుకులాల ద్వారా విద్య కొంత మంది విద్యార్థులకే అందుతోంది. మరి గ్రామాలలోని మిగతా వారి పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించారు. 1,000 గురుకులాల్లో 5వ తరగతి నుంచి 12 వరకు చదువుతున్న విద్యార్థుల సంఖ్య 4 లక్షలకు మించరని.. మరి మిగతా విద్యార్థులకు విద్యనందించే బాధ్యత సర్కారు మీద లేదా..? అనేది ప్రశ్నార్ధకమని విజయశాంతి అన్నారు.
సీఎం కేసీఆర్ చదువుకున్న దుబ్బాక బడి, మంత్రి హరీశ్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట స్కూల్, మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల సర్కారు బడులు ఉన్నట్లే రాష్ట్రంలో అన్ని బడులు ఎందుకు ఉండకూడదో వారే చెప్పాలని నిలదీశారు. రాష్ట్రంలోని మిగతా 6,000 హైస్కూల్స్, 20 వేల ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ స్కూళ్లలో ఆ స్థాయి డెవలప్ మెంట్, సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కేవలం కుటుంబ పాలనతో వారి వారి ప్రాతినిధ్యం వహిస్తున్న వాటికి ప్రాధాన్యతనిస్తున్న దొర కుటుంబం యావత్ తెలంగాణ ప్రజలను మరిచారన్నది పచ్చి నిజమని విమర్శించారు.
కేంద్రం ప్రవేశ పెట్టిన నూతన విద్యా విధాన పాలసీని పక్క రాష్ట్రం ఏపీలో అమలు చేస్తున్నా.. ఇక్కడి తెలంగాణ ప్రభుత్వం మాత్రం సర్కార్ బడుల్లో కిండర్ గార్డెన్ తరగతులు స్టార్ట్ చేసుకునే వీలు ఉన్నా.. పెద్దగా పట్టించుకోవడం లేదని అన్నారు. అంగన్వాడీలను సర్కారు బడులకు అనుసంధానం చేసి కేజీ తరగతుల ప్రారంభం గురించి ఇప్పటి వరకు ప్రణాళికలే సిద్ధం చేయకపోవడం దురదృష్టకరమని విజయశాంతి అన్నారు. రాష్ట్రంలో 26 వేలకు పైగా బడుల్లో విద్యార్థులు లేని వాటిని మూసివేయడానికి ప్రభుత్వం రేషనలైజేషన్ ప్రక్రియ ప్రారంభించింది. దాదాపు 2 వేల బడులకు సౌలతులు కల్పించకుండా మూసివేసి పది వేల మంది టీచర్లు అదనంగా ఉన్నారని లెక్కలు వేస్తుందని అన్నారు.
విద్య అనేది పెట్టుబడి పెట్టినా.. రాబడి లేనిదిగా భావించి.. రాబడి వచ్చే మద్యం అమ్మకాలపై దృష్టి పెట్టి భారీగా ఆదాయాన్ని పొందుతుందని ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 500 పైగా ఎంఈవో పోస్టులు, 1,800 హైస్కూల్ హెచ్ఎం, 2,000 వరకు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, వేలకొద్దీ ఎస్జిటి పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. అయితే అన్ని స్థాయిలో నిబంధనల మేరకు పదోన్నతులు కల్పిస్తే.. అదనపు పోస్టులు భర్తీ చేయవచ్చు. కానీ ప్రభుత్వం పదవి విరమణ వయసు పెంచి.. ఉన్న నిరుద్యోగులకు నిరాశను మిగుల్చుతుందని ఫైర్ అయ్యారు.
రాష్ట్రంలో వివిధ యూనివర్సిటీల్లో ప్రొఫెసర్, అసిస్టెన్స్ ప్రొఫెసర్ వంటి పోస్టులు భర్తీ చేయకుండా ఉన్నత విద్యను నిరుపేదలకు విద్యను దూరం చేస్తుందని మండిపడ్డారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రజానీకం, నిరుద్యోగులు,యువకులు ఆలోచించాలని.. దొరల పాలనకు అంతం పలికేందుకు బీజేపీనే ప్రత్యామ్నాయమని గ్రహించి.. రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ పాలనకు అంతం పలకాలని విజయశాంతి అన్నారు.