ఉత్తమ్‌పై వీహెచ్ సంచలన ఆరోపణలు
అంబర్ పేట్ నియోజకవర్గం నుంచి తాను గతంలో గెలిచి మంత్రిని అయ్యాను.. అంబర్ పేట్ అభివృద్ధి కోసం అనేక పనులు చేశానని
By Medi Samrat Published on 22 Oct 2023 3:16 PM GMTఅంబర్ పేట్ నియోజకవర్గం నుంచి తాను గతంలో గెలిచి మంత్రిని అయ్యాను.. అంబర్ పేట్ అభివృద్ధి కోసం అనేక పనులు చేశానని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇక్కడి నుంచి కాంగ్రెస్ టికెట్ ను లక్ష్మణ్ యాదవ్ అడుగుతున్నా.. గతంలో ఇక్కడి నుంచి యాదవ్ లు గెలిచారు. గత ఎన్నికల్లో కోదండరాం గట్టిగా పట్టు పట్టి.. అధిష్టానం కూడా చెప్పడంతో వెనక్కి తగ్గామని అన్నారు. ఇప్పుడు ఉత్తమ్ నా అంబర్ పేట్ సీట్ వెంట పడ్డాడు. ఇక్కడ నూతి శ్రీకాంత్ గౌడ్ ను.. ఉత్తమ్ ఎగదోస్తుండని ఆరోపించారు. శ్రీకాంత్ అనే వ్యక్తి.. నాపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ తప్పుడు కేసు పెట్టాడని.. శ్రీకాంత్ లాంటి వ్యక్తిని ఉత్తమ్ ఎంకరేజ్ చేయడం కరెక్ట్ కాదని అన్నారు. నాపై దుష్ప్రచారం చేస్తున్నాడని ఫైర్ అయ్యారు. గత ఎన్నికల్లో డబ్బులు తీసుకొని వెనక్కి తగ్గారని చెప్పడం కరెక్ట్ కాదన్నారు.
హనుమంతరావు డబ్బులు తీసుకునే వ్యక్తి నా..? డబ్బులకు అమ్ముడుపొతే సగం హైదరాబాద్ నాదే ఉండేదన్నారు. సూర్యాపేటలో బీసీ మీటింగ్ పెడుతా అంటే.. పెట్టనీయలేదన్నారు. ఉత్తమ్ కు బీసీ ఓట్లు కావాలి.. బీసీ మీటింగ్ వద్దా.. అని ప్రశ్నించారు. తనను కాంగ్రెస్ లో నుంచి బయటకు పంపేందుకు ఉత్తమ్ కుట్ర చేస్తుండని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను పార్టీ మారను.. గాంధీ కుటుంబానికి విరాభిమానిని అని స్ఫష్టం చేశారు. ఉత్తమ్ తన మనుషులు మహేశ్వర్ రెడ్డి, గూడూరు నారాయణ రెడ్డిని పంపించాడు.. జగ్గారెడ్డిని కూడా పార్టీ నుంచి పంపే ప్రయత్నం చేశాడని.. జగ్గారెడ్డితో పీసీసీ అధ్యక్షుడవు అవుతావని.. రేవంత్ పై ప్రతిరోజు మీడియాలో మాట్లాడించింది ఉత్తమ్ కుమార్ రెడ్డేనని సంచలన ఆరోపణలు చేశారు. పార్టీ మారుతున్నా అని మీడియాలో ప్రచారం చేసుకుని.. బ్లాక్ మెయిల్ చేసి పదవులు తెచ్చుకున్నాడని ఆరోపించారు. స్క్రీనింగ్ కమిటీలో ఉండి మాపై దుష్ప్రచారం చేస్తుండని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తమ్ పార్టీకి వ్యతిరేకంగా చేసిన పనులను బయట పెడుతానన్నారు. నేను పార్టీ లాయలిస్ట్ ను.. నీకు, నీ భార్యకు సీట్లు కావాలి.. మా సీట్లు మాకు వద్దా..? అని ప్రశ్నించారు. అంబర్ పేట సీటు నాది.. నాకు దక్కకుండా చేస్తే.. నేను కూడా ఉత్తమ్ వెంట పడుతానని హెచ్చరించారు.