రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి, బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి సోమవారం నాడు నిరసనకు దిగారు. సాగునీరు అందకపోవడంతో పంటలు ఎండిపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేలు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ కిషన్‌రెడ్డి రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యాలయం వద్ద దీక్షకు దిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయలేదని.. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నాయకులు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు కావస్తున్నా అమలు చేయలేదని గుర్తు చేశారు.
వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. ఆయన మాట నమ్మి రైతులు రుణాలు తీసుకున్నారని.. వ్యవసాయ రుణాలు ఎందుకు మాఫీ కాలేదో వివరించాలని కోరారు. ఇక రైతులకు బ్యాంకులు రుణాలు మంజూరు చేయడం లేదని ఆయన ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రైతులకు ఎకరాకు రూ.15 వేలు పెట్టుబడి సాయం తక్షణమే అందించాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.