ఆర్థిక వనరుల పేరిట భూముల వేలమా? వెంటనే ఆపాలి..రేవంత్‌కు కిషన్ రెడ్డి లేఖ
గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి వేలం ప్రక్రియను విరమించుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు.
By Knakam Karthik
ఆర్థిక వనరుల పేరిట భూముల వేలమా? వెంటనే ఆపాలి..రేవంత్‌కు కిషన్ రెడ్డి లేఖ
గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి వేలం ప్రక్రియను విరమించుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. రాష్ట్ర ఆదాయం కోసం గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి వేలం కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ భూముల వేలంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీఎంకు రాసిన లేఖలో హైచ్‌సీయూ లో ఉన్న 400 ఎకరాల భూమి వేలం ప్రక్రియను విరమించుకోవాలని కోరారు.
ఆర్థిక వనరుల సమీకరణ పేరిట రంగారెడ్డి జిల్లా, శేరిలింగంపల్లి మండలం, కంచ గచ్చిబౌలి గ్రామంలోని సర్వే నంబర్ 25(పి)లో ఉన్న 400 ఎకరాల ప్రభుత్వ భూమిని తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలికసదుపాయాల సంస్థ (TGIIC) ద్వారా వేలం వేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. గతంలో మీరు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు భవిష్యత్తు తరాలను, ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ భూముల అమ్మకానికి వ్యతిరేకంగా మాట్లాడారు. “మనం బ్రతకడానికి, మన సోకులకు ప్రభుత్వ భూములు అమ్మొద్దు, ఒకవేళ ప్రభుత్వ భూములను అమ్మితే భవిష్యత్తులో ప్రజల అవసరం కోసం ఏదైనా నిర్మించాలన్నా, ప్రభుత్వ ఆసుపత్రులు కానీ, విద్యాలయాలు కానీ, చివరకు చచ్చిపోతే స్మశానాలకు కూడా భూమి లేని పరిస్థితి ఉంటుంది” అని గతంలో మీరన్న మాటలను ఈ సందర్భంగా ఒకసారి గుర్తు చేస్తున్నాను. అని లేఖలో తెలిపారు.
నేడు మీరు వేలం వేయాలని నిర్ణయం తీసుకున్న ఈ 400 ఎకరాల ప్రభుత్వ భూమికి ఆనుకుని జీవవైవిధ్యానికి నెలవైన అనేక వృక్షజాలం, జంతుజాలం, సరస్సులు ఉన్నాయి. ఇందులో 734 వృక్ష జాతులు, 220 పక్షి జాతులతో సహా నెమళ్లు, వలస పక్షులు, మచ్చల జింకలు, నాలుగు కొమ్ముల జింకలు, అడవి పందులు, కొండ చిలువలు, భారతీయ నక్షత్ర తాబేళ్లు వంటి వైవిధ్యభరితమైన జీవజాతులు, మష్రూమ్ రాక్ తో సహా సహజసిద్ధంగా ఏర్పడి ఎంతో ఆకర్షణీయంగా ఉండే రాళ్ళ అమరికలెన్నో ఉన్నాయని అనేకమంది ప్రముఖులు తెలియజేస్తున్నారు..అని కిషన్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు.
ఇప్పటికే రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో పచ్చదనం పూర్తిగా తగ్గిపోతోంది, ఖాళీ స్థలాలు అనేక కారణాలతో కనుమరుగవుతున్నాయి. నగరంలో ఆట స్థలాలు, వాకింగ్ ట్రాక్ లు, పార్కులు, పర్వావరణ స్థలాలు అన్యాక్రాంతమవుతున్నవి. భవిష్యత్తు తరాల కోసం కొంతయినా ఈ స్థలాలను రక్షించవలసిన బాధ్యత మనందరిపైన ఉన్నది. కావున, ప్రభుత్వ భూముల అమ్మకంపై గతంలో మీరు వ్యక్తం చేసిన అభిప్రాయాలకు కట్టుబడి ఉంటారని, సహజసిద్ధంగా ఏర్పడిన కొండలతో సహా పర్యావరణ, జీవ వైవిధ్యానికి ఎలాంటి నష్టం చేకూర్చకుండా సంరక్షిస్తారని, ఈ 400 ఎకరాల ప్రభుత్వ భూముల వేలం ప్రక్రియను వెంటనే నిలుపుదల చేయాలని మనవి చేస్తున్నాను. అని లేఖలో కిషన్ రెడ్డి పేర్కొన్నారు.