ఫలించిన బండి సంజయ్ కృషి.. 'రియల్ హీరో' అంటూ కొనియాడుతున్న ప్రజలు
సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల గ్రామంలో వరదల్లో చిక్కుకుపోయిన ఐదుగురు వ్యక్తులను కాపాడేందుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ నిన్నటి నుండి చేసిన కృషి ఫలించింది.
By Medi Samrat
సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల గ్రామంలో వరదల్లో చిక్కుకుపోయిన ఐదుగురు వ్యక్తులను కాపాడేందుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ నిన్నటి నుండి చేసిన కృషి ఫలించింది. ఆర్మీ హెలికాప్టర్లను ప్రత్యేకంగా రప్పించి బాధితులను ఎయిర్ లిఫ్ట్ చేసి కాపాడారు. దీంతో ప్రాణభయంతో వరదల్లో చిక్కుకుని బిక్కుబిక్కుమన్న బాధితులు క్షేమంగా బయటపడి ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు ఆర్మీ హెలికాప్టర్లు వస్తున్నాయనే సమాచారం అందుకున్న బండి సంజయ్.. ఈరోజు మధ్యాహ్నం నర్మాలకు చేరుకోవడం, అప్పటికే ఆర్మీ హెలికాప్టర్లు బాధితులను బయటకు తీసుకురావడం చకచకా జరిగిపోయాయి.
ఈ నేపథ్యంలో నర్మాలకు కేంద్ర మంత్రి చేరుకోగానే క్షేమంగా బయటపడ్డ బాధితులు బండి సంజయ్ వద్దకు వచ్చి తమ ప్రాణాలను కాపాడినందుకు ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు నర్మాల గ్రామస్థులతోపాటు అక్కడికి వచ్చిన జనమంతా బండి సంజయ్ ను ‘‘రియల్ హీరో’’ అంటూ అభివర్ణించారు. వారందరికీ అభివాదం చేస్తూ నర్మాల శివారులో పొంగి పొర్లుతున్న వరద ప్రవాహాన్ని వీక్షించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా బండి సంజయ్ సూచించారు.
మరోవైపు వరదల్లో గల్లంతైన నర్మాలకు చెందిన పంపుకాడి నాగయ్య నివాసానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ వెళ్లారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. మనోధైర్యం కోల్పోవద్దని, అండగా ఉంటామని వారిని ఓదార్చారు. నాగయ్య కుమారుడు సాయికి రూ.లక్ష ఆర్ధిక సాయం అందించారు. ధైర్యంగా ఉండాలంటూ భరోసా ఇస్తూ ముందుకు కదిలారు. నిన్నటి నుండి రెస్క్యూ ఆపరేషన్లలో నిమగ్నమైన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది చేసిన కృషి మరువలేనిదన్నారు. నర్మాలలో రెస్య్కూ ఆపరేషన్ ను పర్యవేక్షిస్తున్న ఎన్డీఆర్ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ దామోదర సింగ్ ను అభినందిస్తూ కేంద్ర మంత్రి శాలువాతో సన్మానించారు.
అంతకుముందు బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ ‘‘భారీ వర్షాలు, వరదలతో ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. నర్మాల వరదల్లో బాదితులు చిక్కుకుపోయారని తెలిసిన వెంటనే కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కోరిన వెంటనే ఆర్మీ హెలికాప్టర్లను పంపారు. అయితే వాతావరణం అనుకూలించకపోవడంతో నిన్న రాలేకపోయాయి. ఈరోజు వర్షం కొద్దిసేపు తెరిపి ఇచ్చిన వెంటనే హెలికాప్టర్లు వచ్చి బాధితులను ఎయిర్ లిఫ్ట్ చేశారు. కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా లకు ధన్యవాదాలు. బాధితుల ప్రాణాలను కాపాడేందుకు నిన్నటి నుండి కష్టపడి పనిచేస్తున్న వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ప్రత్యేకించి ఆర్మీ చాపర్లను తెచ్చి బాధితుల ప్రాణాలు కాపాడిన రక్షణ శాఖ అధికారులకు అభినందనలు. ముఖ్యంగా ఎయిర్ కమాండర్ వీఎస్.శైని చేసిన క్రుషి అంతా ఇంతా కాదు. ఆయనకు హ్యాట్సాఫ్ చెబుతున్నా. ప్రస్తుతమున్న రెండు హెలికాప్టర్లతోపాటు అదనంగా మరో రెండు హెలికాప్టర్లు సిరిసిల్లకు వచ్చాయి. వరద బాధిత ప్రాంతాల్లోని ప్రజలను ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ టైంలో దయచేసి రాజకీయాలు వద్దు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం సరికాదు. బాధితులను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో పూర్తిగా సమన్వయంతో కలిసి పనిచేసేందుకు సిద్దంగా ఉన్నాం. ముఖ్యమంత్రి, మంత్రులతో నిరంతరం మాట్లాడుతూ.. పరిస్థితిని అంచనా వేస్తున్నాం.’’ అని తెలిపారు.
జిల్లా కలెక్టర్, ఎస్పీలకు హ్యాట్సాఫ్ చెప్పిన కేంద్ర మంత్రి
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ సిరిసిల్ల జిల్లా కలెక్టర్, ఎస్పీలను ప్రత్యేకంగా అభినందించారు. నర్మాలకు వచ్చిన కేంద్ర మంత్రిని జిల్లా కలెక్టర్, ఎస్పీ కలిసి పరిస్థితిని వివరిస్తూ తీసుకుంటున్న సహాయ చర్యలను వివరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ‘‘జిల్లా కలెక్టర్, ఎస్పీ నిన్నటి నుండి కష్టపడి పనిచేస్తూనే ఉన్నారు. వీళ్లు లేకుంటే భయంతో బాధితులు ఏమైపోయేవారో. వాళ్లకు ఎప్పటికప్పుడు భరోసా ఇస్తూ వారికి అవసరమైన సాయం చేస్తూ ప్రాణాలు కాపాడిన వీరిద్దరికీ హ్యాట్సాఫ్’’అని అభినందించారు.
నర్మాలలో ఎదురపడ్డ కేటీఆర్
మరోవైపు నర్మాల బాధితులను పరామర్శించి కేంద్ర మంత్రి బండి సంజయ్ వెళుతుండగా మాజీ మంత్రి కేటీఆర్ ఎదురుపడ్డారు. బండి సంజయ్ ను చూడగానే ఆయన కాన్వాయ్ వద్దకు కేటీఆర్ వచ్చారు. వాహనం దిగి కేటీఆర్ వద్దకు వచ్చిన బండి సంజయ్ అభివాదం చేశారు. బాగున్నారా? అంటూ ఒకరికొకరు పలకరించుకున్నారు. కష్టపడుతున్నావంటూ కేటీఆర్ ఈ సందర్భంగా బండి సంజయ్ ను ఉద్దేశించి చెబుతూ నర్మాల బాధితులను పరామర్శించేదుకు కేటీఆర్ వెళ్లిపోయారు.
నర్మాల బాధితులను కాపాడేందుకు సంజయ్ యత్నం
గత రెండ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తోడు ఎగువనుండి ఊహించని విధంగా వరద నీరు రావడంతో నర్మాల వరదల్లో పిట్ల నర్సింహులు, ధ్యానబోయిన స్వామి, పిట్ల మహేశ్, పిట్ల స్వామి, జంగం స్వామి చిక్కుకుపోయారని సమాచారం వచ్చిన వెంటనే సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాకు ఫోన్ చేసి పరిస్థితిని వాకబు చేశారు. వరదల్లో చిక్కుకున్నందున వారిని కాపాడే పరిస్థితి లేదని, ఆర్మీ హెలికాప్టర్ సాయం కావాలని, అట్లాగే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని రంగంలోకి దించాలని కోరడంతో సానుకూలంగా స్పందించిన బండి సంజయ్ వెంటనే కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు ఫోన్ చేసి ఆర్మీ హెలికాప్టర్లను పంపించాలని కోరారు. బండి విజ్ఝప్తికి అంగీకరించిన రాజ్ నాథ్ సింగ్ తక్షణమే ఆర్మీ హెలికాప్టర్లను పంపించాలని రక్షణ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన ఎయిర్ కమాండర్ వీఎస్.శైనీ, గ్రూప్ కెప్టెన్ హెచ్ సీ ఛటోపాధ్యాయ హకీంపేట నుండి నిన్న సాయంత్రమే హెలికాప్టర్లను పంపారు. అయితే కొద్దిదూరం వెళ్లిన 2 హెలికాప్టర్లు వాతావరణం అనుకూలించకపోవడంతో వెనుదిరిగాయి. అయితే బాధితులు అధైర్యపడొద్దని, వాతావరణం అనుకూలించిన వెంటనే హెలికాప్టర్లు నర్మాలకు వస్తాయని, ఎయిర్ లిఫ్ట్ చేస్తాయని భరోసా ఇచ్చారు.