గ్రూప్‌-1 అభ్యర్థులతో ర్యాలీగా సెక్రటేరియట్‌కు వెళ్తున్న కేంద్ర మంత్రి బండి సంజయ్

గ్రూప్‌-1 అభ్యర్థులు అశోక్ నగర్ చౌరస్తాలో రోడ్డుమీద బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు.

By Medi Samrat  Published on  19 Oct 2024 8:15 AM GMT
గ్రూప్‌-1 అభ్యర్థులతో ర్యాలీగా సెక్రటేరియట్‌కు వెళ్తున్న కేంద్ర మంత్రి బండి సంజయ్

గ్రూప్‌-1 అభ్యర్థులు అశోక్ నగర్ చౌరస్తాలో రోడ్డుమీద బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ అక్కడకు చేరుకొని వారికి మద్దతు పలికారు. ఈ నేపథ్యంలోనే చలో సెక్రటేరియట్ అంటూ అభ్యర్థులందరూ పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. సెక్రటేరియట్ వైపు వెళుతున్న ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను ముందుకు వెళ్లకుండా పోలీసు ఉన్నతాధికారులు అడ్డుపడ్డారు. ఈ క్ర‌మంలోనే పోలీసుల తీరుపై కేంద్ర మంత్రి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

మహిళలని చూడకుండా హాస్టళ్లలో చొరబడి కొట్టే అధికారం మీకెవరిచ్చారని పోలీసులపై సంజయ్ మండిపడ్డారు. అకారణంగా మహిళా అభ్యర్థులను బయటకు గుంజుకొచ్చి గంటల తరబడి నిర్బంధించే అధికారం మీకెవరు ఇచ్చారని నిప్పులు చెరిగారు. సీఎంను కలిసి వాస్తవాలు వివరించేందుకే సెక్రటేరియట్ వెళుతున్నామని కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. బండి సంజయ్ ను పోలీసులు అడుగడుగునా అడ్డుకునే ప్ర‌య‌త్నం చేస్తుండ‌గా.. సచివాలయానికి వెళ్లి తీరుతామని బండి సంజయ్ అంటున్నారు. వేలాది మంది అభ్యర్థులు పోలీసులు గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. తీవ్ర ఉద్రిక్తత నడుమ కొనసాగుతున్న బండి సంజయ్ ‘ఛలో సెక్రటేరియట్’ ర్యాలీ ముందుకు సాగుతుంది.


Next Story