తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు..!
వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడింది దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతాల్లో
By Medi Samrat Published on 8 Sept 2023 8:41 PM IST
వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడింది దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శని, ఆదివారాల్లో తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ప్రత్యేకించి దక్షిణ తెలంగాణను అప్రమత్తం చేసింది. అలాగే మూడు నాలుగు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, సిద్దిపేట, కామారెడ్డి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. కాగా, ఆలస్యంగా ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు క్రియాశీలకంగా ఉన్నాయి. సెప్టెంబర్ 9వ తేదీ నుంచి అవి తిరోగమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ సారి ముందస్తుగానే ఈశాన్య రుతుపవనాల రాక మొదలు కావొచ్చని ఐఎండీ అంచనా వేస్తోంది.