గణతంత్ర దినోత్సవ వేడుకలలో విషాదం చోటు చేసుకుంది. ములుగు జిల్లాలో శుక్రవారం జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో విద్యుదాఘాతంతో ఇద్దరు యువకులు మృతి చెందారు. జిల్లా కేంద్రంలోని ఎస్సీ వాడలో జరిగిన ఈ ఘటనలో మరో యువకుడు గాయపడ్డాడు. 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ జెండాను ఆవిష్కరించేందుకు సిద్ధమవుతున్న సమయంలో జెండా పైపుకు విద్యుత్ వైర్లు తగిలి ముగ్గురు యువకులు విద్యుత్ షాక్ కు గురయ్యారు. ఈ క్రమంలో వారిని వెంటనే ములుగు జిల్లా ఆస్పత్రికి తరలించారు. కానీ ఫలితం దక్కలేదు.
చికిత్స ఇద్దరు మృతి చెందారు. మృతులు విజయ్ (25), అంజిత్ (35)గా గుర్తించారు. మరో యువకుడు చక్రి (25) తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చేరాడు. విషయం తెలిసిన వెంటనే ఆస్పత్రికి చేరుకున్న రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క మృతుల కుటుంబాలను ఓదార్చారు. మృతులు ఒక్కొక్కరికి రూ.5లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని సీతక్క హామీ ఇచ్చారు. గాయపడ్డ వ్యక్తికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. అవసరమైతే మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించాలని సూచించారు.