ఫోన్ ట్యాపింగ్ కేసులో ట్విస్ట్.. 150 ప్రొఫైల్స్‌లో..15 మంది జడ్జిలపై నిఘా
తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి.
By Knakam Karthik Published on 31 Jan 2025 11:08 AM ISTఫోన్ ట్యాపింగ్ కేసులో ట్విస్ట్.. 150 ప్రొఫైల్స్‌లో..15 మంది జడ్జిలపై నిఘా
తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ క్రమంలోనే విచారణలో భాగంగా మరో విస్తుపోయే నిజం బయటికి వచ్చింది. గత ప్రభుత్వ హయాంలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులుగా పని చేసిన వారి పూర్తి వివరాలు ఈ కేసులో కీలక నిందితుడి కంప్యూటర్‌లో ఉన్నట్లు గుర్తించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకంగా ఉన్న మాజీ స్పెషల్ ఇంటెలిజెన్స్ ప్రభాకర్ రావు 150 మంది ప్రొఫైల్స్‌ను సిద్ధం చేసినట్లు వెలుగులోకి వచ్చింది. ఇందులో 15 మంది జడ్జిల ప్రొఫైల్స్ ఉన్నట్లు గుర్తించారు.
కాగా సిటీ పోలీసులు హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో ఈ కీలక అంశాలను ప్రస్తావించారు. జడ్జిలు, వ్యాపార వేత్తలు, రాజకీయ నాయకులు, మీడియా యజమానులతో పాటు జర్నలిస్టుల ప్రొఫైల్స్‌ను కూడా ప్రభాకర్ రావు తయారు చేసినట్లు పోలీసులు తమ అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం మొత్తం ప్రభాకర్ రావు డెస్క్ టాప్ నుంచి సేకరించినట్లు పోలీసులు వెల్లడించారు. 150 మంది ప్రొఫైల్స్‌లో కొంతమంది ఫోన్లు ట్యాప్ చేసినట్లు సిటీ పోలీసులు తెలిపారు.
కొంతమంది జడ్జీలకు, రాజకీయ పార్టీలతో ఉన్న సంబంధాలను కూడా ఆ ప్రొఫైల్స్‌లో ప్రభాకర్ రావు తయారు చేసినట్లు కోర్టుకు తెలిపారు పోలీసులు. హై ప్రొఫైల్ కేసుల్లో బెయిల్ మంజూరు చేసిన జడ్జిల వివరాలను కూడా ప్రభాకర్ రావు సేకరించాడని, జడ్జిలు, రాజకీయ పార్టీలు, వ్యాపారవేత్తలతో సంబంధాలపై పూర్తి స్థాయిలో డేటా సేకరించాడని పోలీసులు తమ అఫిడవిట్‌లో పేర్కొన్నారు. కొంతమంది జడ్జిల ఫోన్లను ప్రభాకర్ రావు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసినట్లు ఐడెంటిఫై చేశారు. ప్రభాకర్ రావుతో పాటు ప్రణీత్ రావు డెస్క్‌టాప్‌లలో కీలక సమాచారం సేకరించినట్లు పోలీసులు వెల్లడించారు.
కాగా, కేసులో కీలక నిందితులుగా ఉన్న అడిషనల్ ఎస్పీ భుజంగ రావు, మాజీ డీసీపీ రాధాకిషన్ రావులకు హైకోర్టు ధర్మాసనం గురువారం బెయిల్ మంజూరు చేసింది. అదేవిధంగా రూ.లక్ష చొప్పన రెండు పూచికత్తులు, పాస్‌పోర్టులను కూడా హ్యాండోవర్ చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. విచారణ అధికారులు ఎప్పుడు పిలిచినా దర్యాప్తునకు సహకరించాలని, సాక్షులను ప్రభావితం చేయొద్దని, సాక్షాధారాలను కూడా చెరిపి వేసేందుకు ప్రయత్నం చేయకూడదని అడిషనల్ ఎస్పీ భుజంగ రావు, మాజీ డీసీపీ రాధాకిషన్ రావు లకు స్పష్టం చేసింది. ఇదే కేసులో అడిషనల్ ఎస్పీ తిరుపతన్నకు సుప్రీం కోర్టు కూడా షరుతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.