తెలంగాణలో పోలింగ్ సందడి నెలకొంది. ఉమ్మడి నల్లగొండ – వరంగల్- ఖమ్మం జిల్లాల ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నికకు మే 27న పోలింగ్ నిర్వహించనున్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనున్నది. మూడు జిల్లాల్లో మొత్తం 4,63,839 మంది ఓటర్లు ఉన్నారు. ఈ మేరకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తిచేసింది. మొత్తం 605 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ ఎన్నిక బ్యాలట్ పేపర్ ద్వారా నిర్వహిస్తారు. బరిలో మొత్తం 52 మంది అభ్యర్థులు ఉన్నారు. గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఓటర్లుగా ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సోమవారం స్పెషల్ క్యాజువల్ లీవ్ మంజూరు చేయగా.. ప్రైవేటు సంస్థలు, కార్యాలయాల్లో పనిచేసే వారు ఓటు హక్కు వినియోగించుకునేందుకు పనివేళల్లో వెసులుబాటు కల్పించాలని ఆయా సంస్థలకు ఎన్నికల సంఘం సూచించింది.
ఒక పోలింగ్ కేంద్రంలో సగటున 800 మంది ఓటు హక్కు వినియోగించుకునే విధంగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేశారు. పట్టణాలు, నియోజకవర్గ, మండల కేంద్రాల్లో పోలింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. 283 పోలింగ్ కేంద్రాల్లో 800 మంది కంటే ఎక్కువగా ఓటర్లు ఉన్నారు. ఈ ఎన్నికలో నోటా ఆప్షన్ ఉండదు. మే 5న నల్లగొండ జిల్లా కేంద్రంలో ఓట్లను లెక్కించనున్నారు. ఈ ఎన్నికల నిర్వహణకు పటిష్ట బందోబస్తును ఏర్పాటుచేశారు.