వానకాలం వడ్లు కొంటాం.. రైతులు ఆందోళన చెందొద్దు..!

TS govt has said it will buy rice. వానకాలం వడ్లు కొనేందుకు గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం అధికారులను

By అంజి  Published on  17 Oct 2021 4:27 AM GMT
వానకాలం వడ్లు కొంటాం.. రైతులు ఆందోళన చెందొద్దు..!

వానకాలం వడ్లు కొనేందుకు గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. గతంలో వానకాలం, యాసంగిలో ధాన్యం సేకరించినట్టుగానే.. ఇప్పుడు కూడా ధాన్యం సేకరిస్తామని తెలిపింది. ఈ మేరకు ధాన్యం కొనుగోళ్లపై పౌరసరఫరాల శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. గతంలో లాక్‌డౌన్‌ కారణంగా రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా గ్రామాల్లోనే ధాన్యం సేకరించింది ప్రభుత్వం. ఈ సంవత్సరం కూడా అదే మాదిరిగా వడ్లు కొనుగోలు చేయనున్నారు.

ఇందు కోసం రాష్ట్ర వ్యాప్తంగా 6 వేల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఈసారి రికార్డు స్థాయిలో ధాన్యం సేకరించే అవకాశాలున్నాయని అధికారులు అంచనా వేశారు. ఇందుకు కావాల్సిన చర్యలను ప్రభుత్వం చేపట్టింది. ఇటీవల వానకాలం వడ్లు కొనరంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే అధికారులు చర్యలు చేపట్టారు. రా రైస్ ధాన్నాన్ని కొనుగోలు చేస్తామని అధికారులు తెలిపారు. గత వానకాలంలో 48.85 లక్షల టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించింది. వచ్చే యాసంగిలో మాత్రం బాయిల్డ్ రైస్‌ను తీసుకోబోమని కేంద్రం ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం.. గ్రామాల్లో ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రం వద్ద కొవిడ్‌ రూల్స్ పాటించాలి.

అలాగే ధాన్యం తేచ్చే రైతు అకౌంట్‌లో మాత్రమే డబ్బులు వేయాలి. ఒక వేళ రైతుకు బ్యాంక్‌ అకౌంట్‌ లేకపోతే కచ్చితంగా కొత్త బ్యాంక్ అకౌంట్ తీయాల్సి ఉంటుంది. ఆధార్‌ నంబర్‌ చెక్‌ చేసిన తర్వాత ధాన్యాన్ని కొంటారు. కొనుగోలు కేంద్రాల్లో తాత్కాలిక వసతలను మార్కెటింగ్ శాఖ, జిల్లా కలెక్టర్‌లు ఏర్పాటు చేయాలి. మద్ధతు ధరకు వరి ధాన్యం కొనుగోలు చేస్తారు. అలాగే దళారులకు అడ్డుకట్ట వేసెందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోనున్నారు. ఏఈవోల సాయంతో రైతుల వివరాలు సేకరించి.. ఆయా గ్రామాల్లో వడ్లు కొనుగోలు చేస్తారు. ధాన్యం కొనుగోలులో ఇబ్బందులు ఎదురైతే 1800-42500333, 1967 టోల్‌ నంబర్లకు కాల్‌ చేసి ఫిర్యాదు చేయవచ్చు.

Next Story
Share it