మునుగోడు నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ విజయం అనివార్యమని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు బహిరంగ సభకు.. వెస్ట్ మారేడ్‌పల్లి మున్సిపల్ గ్రౌండ్స్ నుంచి మునుగోడు వరకు నిర్వహించ తలపెట్టిన భారీ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. కొందరి స్వార్థ రాజకీయ ప్రయోజనాల వల్లే నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైందన్నారు.
మునుగోడులో టీఆర్‌ఎస్ విజయం ఖాయమని పేర్కొన్న మంత్రి.. 'బీజేపీ ఎమ్మెల్యేలు గెలిచిన నియోజకవర్గాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ని నిధులు తీసుకొచ్చారో చెప్పగలరా?' అని ప్రశ్నించారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో దేశంలోనే తెలంగాణ ముందంజలో ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఉచితంగా డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను నిర్మిస్తోందని, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద ఆర్థిక సాయం అందజేస్తోందని, దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఈ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం లేదన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో రాష్ట్రంలో అనేక మంది పారిశ్రామికవేత్తలు కంపెనీలను నెలకొల్పుతున్నారని.. టీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని మంత్రి తెలిపారు.