యశ్వంత్ సిన్హాకు టీఆర్ఎస్ మద్దతు..!
TRS to support Yashwant Sinha in Presidential polls. రాష్ట్రపతి ఎన్నికలకు ఉమ్మడి ప్రతిపక్షాల అభ్యర్థిగా మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్ సిన్హాను
By Medi Samrat
రాష్ట్రపతి ఎన్నికలకు ఉమ్మడి ప్రతిపక్షాల అభ్యర్థిగా మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్ సిన్హాను ప్రకటించిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతి ఎన్నికలలో యశ్వంత్ సిన్హాకు టీఆర్ఎస్ మద్దతు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ జోక్యంతో టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
అనేక తర్జనభర్జనల అనంతరం శరద్ పవార్ ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరైన ప్రతిపక్ష నేతలు యశ్వంత్ సిన్హాను బరిలో దింపేందుకు ఏకగ్రీవంగా అంగీకరించారు. వీరు ముందుగా జూన్ 15న సమావేశమయ్యారు. అయితే అభ్యర్థులు నిరాకరించడంతో ఏకాభిప్రాయం కుదరలేదు.
వివిధ ప్రతిపక్ష పార్టీలు వేర్వేరు పేర్లను ప్రతిపాదించడంతో మీడియాలో విస్తృత ప్రచారం జరగడం.. అభ్యర్థికి ముందస్తు ప్రచారం కల్పించడం.. ఓటర్లలో గందరగోళం సృష్టించడంతో టీఆర్‌ఎస్ సమావేశానికి హాజరుకాలేదు. అభ్యర్థి పేరును బహిరంగంగా ప్రకటించే ముందు ప్రతిపక్షాలు పరస్పరం సంప్రదింపులు జరపాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అభిప్రాయపడ్డారని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన ఏన్సీపీ చీఫ్ శరద్ పవార్.. ప్రతిపక్ష పార్టీల తరపున అభ్యర్థిని ప్రకటించే ముందు కేసీఆర్‌కు వ్యక్తిగతంగా ఫోన్ చేసి.. యశ్వంత్ సిన్హాకు మద్దతు ఇవ్వమని కోరినట్లు కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి. దీనిపై స్పష్టత రావాలంటే అధికారిక ప్రకటన వెలువడే వరకూ వేచిచూడాల్సిందే.
ఇదిలావుంటే.. జూన్ 15న ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాగా.. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ జూన్ 29. ఎన్నికల నోటిఫికేషన్ ప్రకారం జూలై 18న ఎన్నికలు జరగనుండగా.. జూలై 21న కౌంటింగ్ నిర్వహించనున్నారు.