ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తుకు.. సీబీఐ అక్కర్లేదు, సిట్ చాలు: హైకోర్టు

TRS MLAs poaching case.. Telangana HC dismisses BJP plea for CBI probe. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐకి అప్పగించాలన్న బీజేపీ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు మంగళవారం

By అంజి  Published on  15 Nov 2022 12:00 PM GMT
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తుకు.. సీబీఐ అక్కర్లేదు, సిట్ చాలు: హైకోర్టు

టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐకి అప్పగించాలన్న బీజేపీ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు మంగళవారం తోసిపుచ్చింది. అయితే ప్రత్యేక దర్యాప్తు బృందం ఆధ్వర్యంలోనే ఈ కేసు విచారణ కొనసాగించాలని హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ధర్మాసనం ఆదేశించింది. అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్)కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను బీజేపీలోకి లాక్కునేందుకు ప్రయత్నించిన ముగ్గురు ఏజెంట్ల అరెస్టుకు సంబంధించిన కేసు దర్యాప్తును సింగిల్ జడ్జి పర్యవేక్షిస్తారని కోర్టు తీర్పునిచ్చింది. హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ నేతృత్వంలో ఏర్పాటైన సిట్‌.. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఉన్నతాధికారులకు వివరించవద్దని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్వల్‌ భుయాన్‌ నేతృత్వంలోని డివిజన్‌ ​​బెంచ్‌ ఆదేశించింది.

ద‌ర్యాప్తు పార‌ద‌ర్శ‌కంగా జ‌ర‌గాల‌ని చెప్పింది. సిట్‌ దర్యాప్తు పురోగతి రిపోర్టును ఈ నెల 29న కోర్టుకు నివేదించాలని ఆదేశించింది. మీడియా, పొలిటికల్‌ నాయకులకు సమాచారాన్ని లీక్ చేయవద్దని కూడా సిట్‌ బృందానికి ఆదేశాలు జారీ చేసింది. సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ బీజేపీ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. టీఆర్‌ఎస్‌కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలకు భారీగా డబ్బు ఎర చూపేందుకు ప్రయత్నించిన రామచంద్రభారతి అలియాస్ సతీష్ శర్మ, సింహయాజీ, నందకుమార్‌లను సైబరాబాద్ పోలీసులు అక్టోబర్ 26 రాత్రి హైదరాబాద్ సమీపంలోని మొయినాబాద్‌లోని ఫామ్‌హౌస్‌లో అరెస్టు చేశారు.

ఎమ్మెల్యేల్లో ఒకరైన పైలట్ రోహిత్ రెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు సైబరాబాద్ పోలీసులు దాడులు నిర్వహించారు. నిందితులు తనకు రూ.100 కోట్లు, మరో ముగ్గురికి ఒక్కొక్కరికి రూ.50 కోట్లు ఆఫర్ చేశారని ఆరోపించారు. నిందితులపై భారత శిక్షాస్మృతి (ఐపీసీ), అవినీతి నిరోధక చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అక్టోబరు 29న హైకోర్టు ఈ కేసుపై కొనసాగుతున్న దర్యాప్తుపై స్టే విధించింది. బిజెపి పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, ఇతర ప్రతివాదులను కోరింది. నవంబర్ 8న కోర్టు స్టే ఎత్తివేసింది. ఈ కేసును విచారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 9న సిట్‌ను ఏర్పాటు చేసింది.

హైదరాబాద్ పోలీస్ కమీషనర్ నేతృత్వంలో, మరో ఆరుగురు పోలీసు అధికారులు ఉన్నారు. నవంబర్ 3న విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిందితులు, ఎమ్మెల్యేల మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన వీడియో రికార్డింగ్‌లతో సహా కేసులో ఆధారాలను విడుదల చేశారు. నిందితులు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు కొందరు బీజేపీ అగ్రనేతల పేర్లను ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగడం లేదంటూ బీజేపీ నేత పరమేందర్‌రెడ్డి సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

Next Story