టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా శుక్రవారం పార్టీ శ్రేణులు తమ నివాసాల వద్ద నల్లజెండాలు ప్రదర్శించారు. యాసంగి వరి కొనుగోలులో కేంద్రం నిర్లక్ష్య వైఖరికి నిరసనగా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదేశాలను పాటించాలని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఖమ్మం, కొత్తగూడెం టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు తాతా మధుసూధన్, కె.కాంతారావు, స్థానిక ఎమ్మెల్యేలు పార్టీ శ్రేణులను కోరారు. ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఆధ్వర్యంలో నగర వీధుల్లో భారీ బైక్ ర్యాలీ చేపట్టారు.
యాసంగి వరి కొనుగోలుకు కేంద్రం నిరాకరించడాన్ని నిరసిస్తూ భారీ సంఖ్యలో టీఆర్‌ఎస్ కార్యకర్తలు, రైతులు ర్యాలీలో పాల్గొన్నారు. యాసంగి సీజన్‌లో పండించిన వరిధాన్యాన్ని కొనుగోలు చేయరాదన్న కేంద్రం నిర్ణయానికి నిరసనగా వరంగల్‌లోని పలు ప్రాంతాల్లో టీఆర్‌ఎస్ కార్యకర్తలు నల్లబ్యాడ్జీలు ధరించి, ప్రధాని నరేంద్ర మోదీ 'శవయాత్ర' చేపట్టారు. వర్ధన్నపేట నియోజకవర్గంలోని చెన్నారం గ్రామంలో, జనగాం జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గంలోని రాయపర్తి మండల కేంద్రం, గీసుగొండ మండల కేంద్రంలో ప్రధాని మోదీ దిష్టిబొమ్మలకు 'శవయాత్ర' నిర్వహించారు.