ఏసీపీ ఉమామహేశ్వర్‌రావు అరెస్టు

హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌లోని సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌లోని ఆర్థిక నేరాల విభాగం అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ (సిసిఎస్ ఏసీపీ)గా పనిచేస్తున్న టీఎస్‌ ఉమామహేశ్వర్‌రావును అవినీతి నిరోధక శాఖ అరెస్టు చేసింది.

By Medi Samrat
Published on : 22 May 2024 9:15 AM IST

ఏసీపీ ఉమామహేశ్వర్‌రావు అరెస్టు

హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌లోని సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌లోని ఆర్థిక నేరాల విభాగం అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ (సిసిఎస్ ఏసీపీ)గా పనిచేస్తున్న టీఎస్‌ ఉమామహేశ్వర్‌రావును అవినీతి నిరోధక శాఖ అరెస్టు చేసింది. హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో సోదాలు నిర్వహించిన అనంత‌రం ఆయ‌న‌ను అరెస్టు చేశారు. ఉమామహేశ్వర్‌రావుపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైంది.

హైదరాబాద్‌లోని వినియోగదారులను రూ.1164 కోట్ల మేర మోసగించిన సాహితీ కేసుకు సంబంధించి టీఎస్ ఉమామహేశ్వర్ రావు విచారణ అధికారిగా ఉండటం గమనార్హం. సాహితీ ఇన్‌ఫ్రా కేసుకు సంబంధించిన నిందితులతో ఉమా మహేశ్వర్‌రావు ‘స్నేహపూర్వకంగా’ వ్యవహరించారని స‌మాచారం.

“సాధారణంగా నేర నిరోధక దర్యాప్తు సంస్థల అధికారులు తీవ్రమైన నేరాల కేసుల్లో కఠినంగా వ్యవహరిస్తారు. అయితే నిందితులతో ఉమామహేశ్వర్ రావు చాలా ‘ఫ్రెండ్లీ’గా ఉండేవారు. అమాయక కస్టమర్లు బిల్డర్ల చేతిలో మోసపోయారు. ఇందులో పోలీసు అధికారి ప్రమేయం కూడా ఉన్నట్లు తెలియ‌డంతో బాధితులు షాక్ అవుతున్నారు.

ఉమామహేశ్వర్‌రావుపై అవినీతి నిరోధక శాఖకు పలు ఫిర్యాదులు రావ‌డంతో.. ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించింది. హైదరాబాద్, విశాఖపట్నంలోని 13 చోట్ల ఉమామహేశ్వర్‌రావు ఆస్తులపై ఏసీబీ దాడులు నిర్వహించి సుమారు రూ.3.5 కోట్ల విలువైన ఇళ్లు, విలువైన భూములు, నగలు, వాహనాలను స్వాధీనం చేసుకుంది. అయితే ఈ ఆస్తుల మార్కెట్ విలువ రూ.40 కోట్లుగా ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. తదుపరి విచారణ కోసం ఉమామహేశ్వర్‌రావును అదుపులోకి తీసుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.

Next Story