దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని దాదాపు 71 రైళ్లకు సంబంధించి సమయ వేళలు మారాయి. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు బుధవారం ప్రకటించారు. మారిన సమయ వేళలు జనవరి 1, 2022 నుండి అమల్లోకి వస్తాయని అధికారులు తెలిపారు. అలాగే ఈ నెల 24, 25 తేదీల్లో రెండు ప్రత్యేక రైళ్లను.. భవానీ దీక్ష భక్తుల కోసం విజయవాడ నుండి పలాస మధ్య నడపనున్నట్లు రైల్వే జోన్ అధికారులు తెలిపారు. ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, విజయనగరం మీదుగా ఈ రైళ్లను నడపనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు రైల్వే వెబ్‌సైట్‌లో ఉన్నాయి.
దీంతో పాటు ఈ నెల 24, 26 తేదీల్లో సికింద్రాబాద్ - కాకినాడ టౌన్- వికారాబాద్ రైల్వే స్టేషన్ల మధ్య రెండు స్పెషల్ రైళ్లను నడపనున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ అధికారులు తెలిపారు. సామర్లకోట, రాజమండ్రి, భీమవరం, విజయవాడ, గుంటూరు, మిర్యాలగూడ, నల్గగొండ మీదుగా ఈ రైళ్లు నడుస్తాయని అధికారులు వెల్లడించారు. రేపు రాత్రి 21.05 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయల్దేరే ప్రత్యేక రైలు (07065) శనివారం ఉదయం 9.30 గంటలకు కాకినాడ టౌన్ చేరుకుంటుంది. తిరిగి ఆదివారం రాత్రి 20.45 గంటలకు కాకినాడలో బయల్దేరే రైలు (07066) సోమవారం ఉదయం 9.25 గంటలకు వికారాబాద్ చేరుకుంటుంది.
కొంత కాలంగా రైళ్ల వేగాన్ని పెంచుతూ, గరిష్ట వేగంతో రైళ్లను నడుపుతున్న విషయం తెలిసిందే. దీంతో రైళ్ల ప్రయాణ సమయం తగ్గింది. మరో వైపు కోవిడ్ ఆంక్షల సడలింపులు జరిగాయి. దీంతో రైళ్ల సమయాలను అధికారులు మారుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జనవరి 1వ తేదీ నుండి కొత్త టైం టేబుల్‌ను అందుబాటులోకి తేనున్నారు. అయితే 10 నిమిషాల నుండి 30 నిమిషాల మేర రైలు వేళ్లలో మార్పులు జరగనున్నట్లు తెలుస్తోంది.