రాముడిని అడ్డుపెట్టుకొని విజయం సాధించారు.. అందుకే రాహుల్‌ను వేధిస్తున్నారు

TPCC Working President Jaggareddy Fire On Center. మోదీ ప్రధాని అయ్యాక రాజకీయ విలువలు పడిపోయాయ‌ని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి

By Medi Samrat  Published on  20 Jun 2022 1:09 PM GMT
రాముడిని అడ్డుపెట్టుకొని విజయం సాధించారు.. అందుకే రాహుల్‌ను వేధిస్తున్నారు

మోదీ ప్రధాని అయ్యాక రాజకీయ విలువలు పడిపోయాయ‌ని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. సోమ‌వారం గాంధీభ‌వ‌న్‌లో మీడియాతో భేటీలో ఆయ‌న మాట్లాడుతూ.. మోదీ ప్రధాని అయ్యాక రాజకీయ విలువలు పడిపోయాయ‌ని.. రాష్ట్రంలో కూడా అంతేన‌ని కామెంట్ చేశారు. ప్రజా సమస్యలపై స్పందిస్తే అధికార దుర్వినియోగంతో మోదీ, అమిత్ షా ప్రతిపక్ష పార్టీల గొంతులు నొక్కుతున్నార‌ని అన్నారు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలిచ్చారని అన్నారు. ఈడీ, ఇన్ కం టాక్స్, సీబీఐ సంస్థలను ప్ర‌భుత్వం దుర్వినియోగం చేస్తుంద‌ని మండిప‌డ్డారు.

మతం పేరున రాజకీయాలు చేస్తున్నార‌ని.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగ్యలక్ష్మి అమ్మవారిని అడ్డు పెట్టుకొని రెండు నుండి 47 స్థానాలు గెలుచుకున్నార‌ని.. దేశంలో రాముడిని అడ్డుపెట్టుకొని విజయం సాధించారని విమ‌ర్శించారు. ప్రజలకోసం పని చేస్తున్న కాంగ్రెస్ నేతలను వేధిస్తున్నార‌ని మండిప‌డ్డారు. రాహుల్ గాంధీకి పైసలు కావాలంటే.. పత్రిక డబ్బులు అవసరం లేదని.. కార్యకర్తలు ఇస్తార‌ని వ్యాఖ్యానించారు. 55 సంవత్సరాలు అధికారంలో ఉండి.. ఆ కుటుంబం సంపాదించుకోవాలంటే సంపాదించుకోలేరా అని ప్ర‌శ్నించారు.

స్వాతంత్య్రం కోసం జైళ్లలో ఉన్న కుటుంబం గాంధీ కుటుంబంపై బీజేపీ చేస్తున్న కుట్రలపై ప్రజలు ఆలోచించాలని జ‌గ్గారెడ్డి అన్నారు. కరోనా,పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువులు, ప్రజా సమస్యలపై పార్లమెంట్ లో ప్రశ్నిస్తే రాహుల్ గాంధీని వేధిస్తున్నార‌ని ఆరోపించారు. ఉదయ్ పూర్ చింతన్ శిబిర్ నిర్ణయం ప్రకారం దేశంలో ప్రజా సమస్యలపై రాహుల్ పాదయాత్ర ఉంటుంద‌ని.. రాహుల్ గాంధీ పాదయాత్రను అడ్డుకునేందుకే ఈడీ విచారణ జ‌రుపుతున్నార‌ని అన్నారు.

వచ్చే ఎన్నికల్లో బీజేపీ.. రాహుల్ పాదయాత్రను అడ్డుకొని గెలువాలనుకుంటుందని.. రాహుల్ ఈడీ విచారణ ముగిసే వరకు వేచి చూస్తాం.. ఏఐసిసి పిలుపు మేర‌కు తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామ‌ని అన్నారు. అడ్డ దారిలో రాజకీయం చేస్తున్న బీజేపీ పార్టీ నేతలు కిషన్ రెడ్డి, బండి సంజయ్ తదితరులను ప్రజాసమస్యలపై నిలదీయాలని ప్ర‌జ‌ల‌ను జ‌గ్గారెడ్డి కోరారు.

Next Story
Share it