జ‌గ్గారెడ్డి అరెస్ట్‌.. భ‌గ్గుమ‌న్న కాంగ్రెస్ శ్రేణులు

TPCC Working President Jaggareddy Arrest. మే 7న ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనలో భాగంగా ఉస్మానియా

By Medi Samrat  Published on  1 May 2022 12:46 PM GMT
జ‌గ్గారెడ్డి అరెస్ట్‌.. భ‌గ్గుమ‌న్న కాంగ్రెస్ శ్రేణులు

మే 7న ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనలో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులను కలిసేందుకు కాంగ్రెస్ పార్టీ చేసిన విన్నపాన్ని ఓయూ వైస్ చాన్సలర్ రవీందర్ యాదవ్ తిరస్కరించారు. దీంతో వైస్ చాన్సలర్ ఛాంబర్ ఎదుట చీర గాజులతో తెలంగాణ ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బల్మూర్ నిరసన తెలిపారు. ఈ నేప‌థ్యంలోనే పోలీసులు వెంక‌ట్‌ను, ఇత‌ర నాయ‌కుల‌ను అరెస్ట్ చేశారు. విష‌యం తెలిసిన టీపీసీసీ వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్ జ‌గ్గారెడ్డి.. ఓయూలో ఎన్ఎస్‌యూఐ అధ్యక్షుడు వెంకట్ అరెస్ట్ కి సంఘీభావం తెలిపేందుకు వెళ్ళాలని నిర్ణయించారు. పరామర్శకు బ‌య‌లుదేరిన జ‌గ్గారెడ్డిని బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

జ‌గ్గారెడ్డి అరెస్ట్‌పై కాంగ్రెస్ శ్రేణులు భ‌గ్గుమ‌న్నాయి. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. జ‌గ్గారెడ్డి అరెస్టును ఖండించారు. రాహుల్ గాంధీ పర్యటన కేసీఆర్ వెన్నులో వణుకు పుట్టిస్తుందని అన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఉస్మానియా యూనివర్సిటీ కి వస్తామంటే అడ్డుకోవడం ఎందుకు అని ప్ర‌శ్నించారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా.. నియంత రాజ్యంలో ఉన్నామా.. అని నిప్పులు చెరిగారు. కేసీఆర్ కుటుంబం అనుభవిస్తున్న భోగాలన్నీ కాంగ్రెస్ పార్టీ, రాహుల్, సోనియా గాంధీ ల భిక్ష అని అన్నారు. కేసీఆర్ ఒక పిరికి పాలకుడని.. ఆయన పాలనకు మరో 12 నెలలు మాత్రమే గడువు ఉందని అన్నారు. రాహుల్ గాంధీ పర్యటనను అడ్డుకున్నందుకు.. విద్యార్థి సంఘాలు నిరసన వ్యక్తం చేస్తే వాళ్ళను అరెస్ట్ చేయడం దారుణమ‌ని.. వారిని కలిసేందుకు వెళితే ఎమ్మెల్యే జగ్గారెడ్డి ని అరెస్ట్ చేస్తారా.. అని మండిప‌డ్డారు. వెంటనే అందరిని విడుదల చేయాలని.. రాహుల్ గాంధీ గారి పర్యటనకు అందరూ సహకరించాలని కోరారు.

ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఎన్ఎస్‌యూఐ అధ్యక్షుడు వెంకట్ అక్రమ అరెస్టులను ఖండించిన.. స్టార్ క్యాంపెనర్, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఖండించారు. పర్మిషన్ కోసం అడిగితే అరెస్ట్ చేస్తారా అని ఫైర్ అయ్యారు. బేషరతుగా మా నాయకులను విడిచిపెట్టాలని కోరారు. పరామర్శకు వెళ్లిన ఎమ్మెల్యే జగ్గారెడ్డిని అరెస్టు చేయడం అప్రజాస్వామికం అని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కుటుంబానికి టిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఇదేనా? అని ప్ర‌శ్నించారు.













Next Story