నేను రోజూ పాలిచ్చే ఆవును.. కాపాడుకోండి : జగ్గారెడ్డి

సంగారెడ్డి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఆసక్తికరంగా మారాయి.

By -  Medi Samrat
Published on : 7 Feb 2026 8:31 PM IST

నేను రోజూ పాలిచ్చే ఆవును.. కాపాడుకోండి : జగ్గారెడ్డి

సంగారెడ్డి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఆసక్తికరంగా మారాయి. సంగారెడ్డి మున్సిపాలిటీలోని 38 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే, ఒక్కో వార్డుకు రూ. 8 కోట్ల చొప్పున మొత్తం రూ. 300 కోట్లతో పట్టణాన్ని అభివృద్ధి చేస్తానని ఆయ‌న‌ హామీ ఇచ్చారు. గతంలో సర్టిఫికెట్లు పొందిన 5500 మందితో పాటు, కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి కూడా 80 గజాల చొప్పున ఇళ్ల స్థలాలు ఇప్పిస్తానని చెప్పారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటితో ఇప్పటికే చర్చించానన్నారు.

తన భార్య నిర్మల సంగారెడ్డి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని, తాను మాత్రం రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తానని స్పష్టం చేశారు. నేను మీకు రోజూ పాలిచ్చే ఆవును. నన్ను కాపాడుకోండి. ఐదేళ్లకోసారి పాలిచ్చే ఆవు కావాలా? రోజూ ఇచ్చే ఆవు కావాలా? మీరే తేల్చుకోండి. అయితే, ఆవుకు మేత లేకపోతే పాలు ఇవ్వదు.. నా దగ్గర కూడా మేత (అధికారం/నిధులు) లేకపోతే పనులు చేయడం కష్టం అన్నారు.

బస్సుల్లో రద్దీ వల్ల వచ్చే చిన్న చిన్న గొడవలను ప్రతిపక్షాలు కావాలనే రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రస్తుతం ప్రభుత్వం పరిస్థితి "బియ్యం తక్కువ ఉన్నా, తినేవాళ్లు ఎక్కువ ఉన్నట్లు" ఉందని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మెల్లమెల్లగా అన్ని పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. రాహుల్ గాంధీ మార్గనిర్దేశంలో ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇళ్లు వంటి హామీలను నెరవేరుస్తున్నామని పేర్కొన్నారు. అధికారం ఒకరి దగ్గర, తాళాలు మరొకరి దగ్గర ఉంటే అభివృద్ధి జరగదని, అందుకే మున్సిపాలిటీలో కాంగ్రెస్ అభ్యర్థులనే గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యేగా లేకపోయినా ప్రజల కోసం పనిచేస్తున్నానని, తనను ఆదరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Next Story