ప్రాణాలు ఇవ్వడమే కానీ.. దాడుల సంస్కృతి కాంగ్రెస్‌ది కాదు : రేవంత్ రెడ్డి
పేదోళ్ల దేవత ఇందిరమ్మ.. పేదల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ఉక్కుమహిళ ఇందిరమ్మ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కొనియాడారు
By Medi Samrat Published on 31 Oct 2023 1:44 PM GMTపేదోళ్ల దేవత ఇందిరమ్మ.. పేదల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ఉక్కుమహిళ ఇందిరమ్మ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కొనియాడారు. కొల్లాపూర్‌లో ఆయన మాట్లాడుతూ.. చివరి రక్తపు బొట్టు వరకూ దేశం కోసం తపించిన వీర వనిత ఇందిరమ్మ అని అన్నారు. కొల్లాపూర్ కు ప్రియాంక గాంధీ గారు రావాల్సి ఉండే.. అనివార్య కారణాలతో ఆమె పర్యటన రద్దు కావడంతో.. రాహుల్ గాంధీ మీ కోసం హుటాహుటిన ఇక్కడకు వచ్చారని వివరించారు.హెలికాప్టర్ లో వెళ్లడం ప్రమాదమని చెప్పినా.. రాహుల్ గాంధీ మీ కోసం రిస్క్ చేసి ఇక్కడకు వచ్చారని తెలిపారు.
కేసీఆర్ లక్ష కోట్లు దోచుకుండని రేవంత్ రెడ్డి ఆరోపించారు. మూడోసారి సీఎం చేయాలని కేసీఆర్, ఆయన కుటుంబం అడుగుతోంది.. ఇంకో లక్ష కోట్లు దోచుకోవడానికా కేసీఆర్ మూడో సారి అధికారం ఇవ్వమంటున్నారు? అని ప్రశ్నించారు. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని కొల్లగొడతారన్నారు.
తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌కు ఒక్క అవకాశం ఇవ్వండని కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చి తెలంగాణ కల సాకారం చేసిన సోనియమ్మ రుణం తీర్చుకుందామని పిలుపునిచ్చారు. పాలమూరు జిల్లాలో 14 కు 14 గెలిపించాల్సిన బాధ్యత ఇక్కడి ప్రజలపై ఉందన్నారు. పాలమూరు పసిడి పంటల జిల్లాగా మారాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు. మీ వాడిగా మీ బిడ్డగా అడుగుతున్నా.. జిల్లాలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. సోనియమ్మ ఇచ్చిన ఆరు గ్యారంటీలు ప్రతీ ఇంటికి చేరుస్తామన్నారు.
ఇందిరమ్మ రాజ్యంలోనే పేదలకు సంక్షేమ ఫలాలు అందుతాయన్నారు. కాంగ్రెస్ వస్తే రైతు బంధు రద్దవుతుందని కేసీఆర్ అంటుండు.. కేసీఆర్ కు అసలు బుద్ది ఉందా.. అని ప్రశ్నించారు. రైతు భరోసా ద్వారా రైతులకు రూ.15 వేలు, రైతు కూలీలకు రూ.12వేలు సోనియమ్మ ప్రకటించిందని వివరించారు.
దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థిపై దాడి నెపం కాంగ్రెస్ పై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. దాడులు చేయదలచుకుంటే.. కేసీఆర్.. నువ్వు నీ కుటుంబం బయట తిరిగేది కాదన్నారు. ప్రాణాలు ఇవ్వడమే కానీ.. దాడుల సంస్కృతి కాంగ్రెస్ ది కాదన్నారు. కాంగ్రెస్ పై నెపం నెట్టి బీఆర్ఎస్ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోందన్నారు.