ఆ 12 మందిని ప్రజా కోర్టులో ఉరి తీసినా తప్పులేదు
TPCC President Revanth Reddy Fire On CM KCR. ఖమ్మం జిల్లాలో అయిదు సార్లు ఓటమి ఎరుగని నేత రాంరెడ్డి వెంకట్ రెడ్డి..
By Medi Samrat Published on 10 Feb 2023 8:45 PM ISTఖమ్మం జిల్లాలో అయిదు సార్లు ఓటమి ఎరుగని నేత రాంరెడ్డి వెంకట్ రెడ్డి.. అందరికీ సహకరించిన గొప్ప నాయకుడు రాంరెడ్డి వెంకట్ రెడ్డి అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజలకు సేవలందించేందుకు రాంరెడ్డి సోదరులు తమ జీవితాలను పణంగా పెట్టారు.. అనారోగ్యంతో మరణించిన రాంరెడ్డి వెంకట్ రెడ్డి సతీమణిని ఏకగ్రీవం చేసాం.. ఎవరైనా ఎమ్మెల్యే మరణిస్తే వారి కుటుంబ సభ్యులను ఏకగ్రీవం చేసే సాంప్రదాయం ఉండేది. ఆ సంప్రదాయాన్ని తుంగలో తొక్కి ఉప ఎన్నికలో అభ్యర్థిని పెట్టి ఆ కుటుంబాన్ని అవమానించారని ఫైర్ అయ్యారు. మీరు అభిమానంతో గెలిపించిన ఎమ్మెల్యే దొరగారి గడీలో గడ్డి తినేందుకు వెళ్లారని విమర్శించారు. పార్టీ ఫిరాయించిన 12మంది ఎమ్మెల్యేలను రాజకీయంగా బొంద పెట్టాల్సిన బాధ్యత తెలంగాణా సమాజంపై ఉందని.. ఆ 12 మందిని ప్రజా కోర్టులో ఉరి తీసినా తప్పులేదని ఆగ్రహించారు.
నిజంగా బీజేపీ కేసీఆర్ అక్రమాలపై చర్యలు తీసుకోవాలని భావిస్తే.. 12 మంది ఎమ్మెల్యేలపై కూడా సీబీఐ విచారణ జరపాలని అన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు 12 మందిపై కూడా విచారణ చేయించాలి.. అలా చేయకపోతే బండి సంజయ్, కిషన్ రెడ్డి కేసీఆర్ కు లొంగిపోయినట్లేనని అన్నారు. నకిలీ వితనాల్లా.. తెలంగాణ రాజకీయాల్లో నకిలీ నాయకులు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని విమర్శించారు. ఆ 12 మంది ఎమ్మెల్యేలను డిపాజిట్లు రాకుండా ఓడగొట్టాలి.. రాజకీయంగా బొంద పెట్టాలని అన్నారు. గొప్పలు మాట్లాడే కేసీఆర్.. సరిహద్దులో జవాన్ చనిపోతే ఆ కుటుంబాన్ని ఈ ప్రభుత్వం ఆదుకోలేదని విమర్శించారు. సంతోష్ బాబు భార్యకు ఉద్యోగం ఇచ్చారు.. భూక్యా రమేష్ కుటుంబాన్ని ఎందుకు ఆదుకోరని ప్రశ్నించారు.
ఆనాడు వైఎస్ నేతృత్వంలో రైతులకు 9 గంటలు నాణ్యమైన ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కరెంటు కోతలపై రైతులు రోడ్డెక్కుతున్నారని అన్నారు. ఖమ్మంలో రైతులకు బేడీలు వేసిన ఘటన రైతులు మరచిపోలేదని.. అందుకు కేసీఆర్ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అన్నారు. 24 గంటలు కరెంట్ ఇవ్వడం కేసీఆర్ తో కాదని అన్నారు. ఈ ప్రాంతంలో 29 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వలేదు.. దళితులకు మూడెకరాలు ఇవ్వలే.. రైతులకు లక్ష రుణమాఫీ చేయలేదు. ఈ పోరాటంలో కమ్యూనిస్టులు కలిసిరావాలని పిలుపునిచ్చారు. కల్వకుంట్ల రాజ్యాన్ని ఖతం చేసి ప్రజా రాజ్యాన్ని నిర్మించుకుందామని పిలుపునిచ్చారు.
జనవరి 1, 2024లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇళ్లు కట్టుకునే ప్రతీ పేదలకు రూ.5లక్షలు అందిస్తామని హామీ ఇచ్చారు. రైతులకు రూ.2 లక్షలు రుణమాఫీ చేసే బాధ్యత కాంగ్రెస్ ది. ఖాళీగా ఉన్న 2లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుందని అన్నారు. అటవీ భూముల హక్కుల చట్టం ప్రకారం పోడు భూములకు పట్టాలిచే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుంది. ఏ అవకాశం ఉన్నా.. రాంరెడ్డి వెంకట్ రెడ్డి కుటుంబానికి రాజకీయంగా మంచి ప్రాధాన్యం ఇచ్చేందుకు నా వంతు ప్రయత్నం చేస్తానని భరోసా ఇచ్చారు. జనవరి 26, 2024 బయ్యారం ఉక్కు కర్మాగారం కోసం శిలాఫలకం వేసే బాధ్యత మాది.. బయ్యారం ఉక్కు కర్మాగారంతో వేలాది యువకులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని రేవంత్ అన్నారు.