గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లను ఏ దేవుళ్లు పాలిస్తున్నారు.. ఈ ప్రాంతాన్ని ఏ దెయ్యం పాలిస్తుంది : రేవంత్

TPCC President Revanth Reddy Fire On CM KCR. తెలంగాణను 8 ఏళ్ళు గా పాలిస్తున్న కేసీఆర్ బంగారు తెలంగాణ చేస్తున్నామని చెప్పి కబంధ హస్తాలలో బంధించార‌ని

By Medi Samrat  Published on  26 Feb 2022 3:32 PM GMT
గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లను ఏ దేవుళ్లు పాలిస్తున్నారు.. ఈ ప్రాంతాన్ని ఏ దెయ్యం పాలిస్తుంది : రేవంత్

తెలంగాణను 8 ఏళ్ళు గా పాలిస్తున్న కేసీఆర్ బంగారు తెలంగాణ చేస్తున్నామని చెప్పి కబంధ హస్తాలలో బంధించార‌ని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి విమ‌ర్శించారు. పరిగిలో కాంగ్రెస్ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన‌ మన ఊరు-మన పోరు బహిరంగ సభలో ఆయ‌న మాట్లాడుతూ.. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాను కొండా రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి, మాణిక్ రావ్, దేవేందర్ గౌడ్ అభివృద్ధి చేశారని అన్నారు. పరిగి ఎమ్మెల్యే దేవుడు మాన్యాలను మింగిండని ఆరోపించారు. చేవెళ్లను కొండ పోచమ్మలో ముంచిండని, చెల్లెమ్మను టిఆర్ఎస్‌లో కలుపుకున్నాడని కేసీఆర్‌పై ఫైర్ అయ్యారు. అభివృద్ధి కోసం టీఆర్ఎస్ లో కలిశామన్న‌ చేవెళ్ల చెల్లెమ్మ ఎందుకు నియోజ‌క‌వ‌ర్గ‌ అభివృద్ధి కోసం అడగడం లేదని రేవంత్ ప్ర‌శ్నించారు.

ఈ ప్రాంతానికి రాజశేఖర్ రెడ్డి ప్రాణహిత చేవెళ్ల తెచ్చారు.. కిరణ్ కుమార్ రెడ్డి పాలమూరు రంగారెడ్డి జీఓ ఇచ్చారన్న రేవంత్‌.. ప్రాణహిత ప్రాజెక్టును చేవెళ్లకు రాకుండా అడ్డుకున్నది కేసీఆర్ కాదా.. యాదగిరి గుట్టలో ప్రమాణం చేసి చెవుతావా కేసీఆర్.. అని అడిగారు. గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లను ఏ దేవుడు పాలిస్తున్నారు.. ఈ ప్రాంతాన్ని ఏ దెయ్యం పాలిస్తుందని నిల‌దీశారు. పాలమూరు రంగారెడ్డిని కట్టమని కేసీఆర్ కోర్టులో ఆఫిడవిట్ ఇచ్చారు.. కేసీఆర్, జగన్ ప్రగతి భవన్‌లో అలయ్ బలాయ్ చేసుకొని మనల్ని నిండా ముంచిండ్రని.. మూడేళ్ళ కిందనే పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసి ఉంటే ఇవాళ ఇలా మా గొంతులు ఎండేవా అని అన్నారు.

ఆంధ్ర వాళ్ళు నీళ్లు, నిధులు దోచుకుపోతున్నారని కేసీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే నిధులు నీళ్లు వస్తాయి అన్నారు. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చాక.. ఇప్పుడు నీళ్లు జగన్ దోచుకుపోయాడు.. నిధులు మేఘ కృష్షా రెడ్డి దోచుకుపోయాడు.. నియామకాలు కేసీఆర్ ఇంట్లో అయ్యాయని విమ‌ర్శించారు. అప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడు.. ఇప్పుడు దేశానికి ప్రధానిని చేయమంటున్నాడు.. ఇక దేవుణ్ణి చేస్తే అన్ని పనులు చేస్తా అనే పరిస్థితి ఉందని.. కేసీఆర్ తాగుబోతు మాటలు నమ్మే పరిస్థితి లేదని రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు.


Next Story
Share it