అందుకే టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్ గా మార్చుకుంటున్నారు

TPCC President Revanth Reddy Fire On BJP And TRS. బీజేపీ, టీఆర్ఎస్ మధ్య వైరుధ్యం ఉన్నట్లు ప్రజలను నమ్మించాలని చూస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు.

By Medi Samrat  Published on  8 Oct 2022 12:34 PM GMT
అందుకే టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్ గా మార్చుకుంటున్నారు

బీజేపీ, టీఆర్ఎస్ మధ్య వైరుధ్యం ఉన్నట్లు ప్రజలను నమ్మించాలని చూస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. శ‌నివారం విలేక‌రుల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ.. కేసీఆర్ అవినీతిపై విచారణ చేసి ఊచలు లెక్కబెట్టిస్తామని బీజేపీ చెబుతోంది. ప్రజలు కూడా వారి మాటలను నమ్మే పరిస్థితి దాపురించిందని అన్నారు. సీబీఐ, ఈడీ తమను వేధిస్తూన్నాయని కేటీఆర్ చెప్పారు. తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య యుద్ధ వాతావరణం ఉన్నట్లు అపోహలు కల్పిస్తున్నారని మండిప‌డ్డారు. మోదీ, అమిత్ షా, కేంద్ర మంత్రులు కేసీఆర్ దోపీడిని ప్రస్తావిస్తున్నారు. కానీ ఇది వాస్తవం కాదని అన్నారు.

ఢిల్లీ హైకోర్టులో నేను సంపూర్ణ వివరాలతో ప్రజా ప్రయోజన వ్యాజ్యము వేశాను. 2018లో ఎలక్షన్ కమిషన్ కు ఢీల్లీ హైకోర్టు అదేశాలిచ్చిందని తెలిపారు. గతంలో గులాబీ కూలీ పేరుతో నిధులు వసూలు చేయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. రాష్ట్రం నలుమూలలా వందలాది కోట్లు వసూలు చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు నిధులను వసూలు చేయడం నేరం. అలాంటి వసూళ్లు లంచం తీసుకోవడంతో సమానం. ఈ విషయంపై ఏసీబీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని అస‌హ‌నం వ్య‌క్తం చేశారు.

పార్టీ చందాలు వసూలు చేశారని కేసును క్లోజ్ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘ నియామవళి ప్రకారం 20 వేల కంటే ఎక్కువ నగదు రూపంలో చందాలు తీసుకోవద్దు. 20 వేల కంటే ఎక్కువ ఖర్చు చేయొద్దు. గులాబీ కూలీ పేరుతో వసూలు చేసిన నిధుల వివరాలు ఎన్నికల సంఘానికి అందించలేదని.. ఎన్నికల సంఘం నియమావళిని కేసీఆర్ ఉల్లంఘించారని అన్నారు. దీనిపై నేను ఎన్నికల సంఘాన్నీ కలిసి చర్యలు తీసుకోవాలని కోరాను. వసూళ్లపై విచారణకు సిబ్బంది లేదని ఎన్నికల సంఘం తెలిపింది. విచారణ కోసం సీబీడీటీ చైర్మన్ కు లేఖ రాసింది. ప్రధానికి పిర్యాదు చేస్తే.. హోంమంత్రికి పంపించారు. నేను ఎంపీ అయిన తర్వాత మళ్ళీ సీబీడీటీ కి ఫిర్యాదు చేశాన‌ని పేర్కొన్నారు.

ఐదేళ్లుగా వందల కోట్లు వసూలు చేస్తున్న ఆర్థిక నేరగాళ్లు అని మండిప‌డ్డారు. కేసీఆర్ ఒక ఆర్ధిక ఉగ్రవాది. ఆయనపై కేంద్రప్రభుత్వం ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని ప్ర‌శ్నించారు. సరైన చర్యలు తీసుకుంటే టీఆరెస్ పార్టీ రద్దు అవుతుందని అన్నారు. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు చేస్తే టీఆర్ఎస్ కుక్కలు చించిన విస్తరి అవుతుందని.. అందుకే టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చుకుంటున్నారని అన్నారు. వ్యూహాత్మకంగానే కేసీఆర్ పార్టీ పేరు మారుస్తున్నారని అన్నారు.

బీజేపీ సహకారంతో చర్యల నుంచి తప్పించుకుంటున్నారని.. వెస్ట్ బెంగాల్ లాంటి పరిస్థితులను తెలంగాణలో సృష్టిస్తున్నారని అన్నారు. ప్రతిపక్ష హోదాను బీజేపీకి ఇప్పించడానికే టీఆర్ఎస్, బీజేపీ డ్రామాలు ఆడుతున్నాయ‌ని.. ఈ దుశ్చర్యలను తెలంగాణ సమాజం గమనించాలని అన్నారు. ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను అమలు చేయకుండా ఎవరు అడ్డుకుంటున్నారో బీజేపీ చెప్పాలని అడిగారు.

రెండు రాజకీయ పార్టీల రాక్ష‌స‌ క్రీడలో భాగమే నిన్న కేటీఆర్ ప్రకటన అని.. దిక్కుమాలిన ప్రకటనల వెనక టీఆర్ఎస్, బీజేపీ అంతర్గత ఒప్పందం ఉందని అన్నారు. కాంగ్రెస్ ను ఖతం చేయడానికే వారి వీధి నాటకాలు అని.. నా పిటిషన్ ను విచారణ జరిపే వరకు టీఆర్ఎస్ పేరు మార్చడానికి వీల్లేదని.. ఈ విషయంపై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేస్తాన‌ని తెలిపారు. రాజ్యసభలో టీఆర్ఎస్ ఫ్లోర్ బీజేపీలో విలీనం అవ్వబోతుందని.. ప్రగతి భవన్ లో ఉండి ప్రగతి సాధించిన హ్యాపీరావు నేతృత్వంలో అది జరగనుందని.. కేటీఆర్ ఆ సంగతి చూసుకుంటే బాగుంటుందని అన్నారు.


Next Story