తెలంగాణ వచ్చినా పాలమూరు గోస తీరలేదు : రేవంత్

తెలంగాణ వచ్చినా పాలమూరు గోస తీరలేదని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి

By Medi Samrat  Published on  29 Aug 2023 7:00 PM IST
తెలంగాణ వచ్చినా పాలమూరు గోస తీరలేదు : రేవంత్

తెలంగాణ వచ్చినా పాలమూరు గోస తీరలేదని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే పాలమూరు జిల్లాకు న్యాయం జరుగుతుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో ఏదైనా అభివృద్ధి జరిగింది అంటే అది కాంగ్రెస్ పార్టీ హయాంలోనే అన్నారు. జూరాల, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, శ్రీశైలం, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో కట్టినవే అని తెలిపారు. మంగళవారం గద్వాల నియోజకవర్గానికి చెందిన బీఆరెస్, బీజేపీ నాయకులు పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ లో చేరినవారిలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకట్ రామిరెడ్డి, రిటైర్డ్ ఎంఈఓ సత్యనారాయణ, ఎంపీటీసీలు శివారెడ్డి, ఈశ్వర్, మాజీ ఎంపీపీలు గోవింద్, నాయుడు, సర్పంచ్ సునీత, వార్డు సభ్యులు ఉన్నారు. వీరికి జూబ్లీహిల్స్ నివాసంలో కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు రేవంత్ రెడ్డి.

బీఆర్ఎస్ వైఫల్యాలను తిరగబడదాం..తరిమికొడదాం నినాదంతో ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి. రాబోయే ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో 14కు 14 అసెంబ్లీ సీట్లలో కాంగ్రెస్ జెండా ఎగరేసేందుకు కార్యకర్తలు కష్టపడాలన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే పాలమూరు జిల్లాలోని అన్ని సాగు నీటి ప్రాజెక్టులను పూర్తి చేయడాన్ని ప్రాధాన్యత అంశంగా తీసుకుంటామని హామీ ఇచ్చారు. చేవెళ్ల దళిత-గిరిజన డిక్లరేషన్ అమలు చేసి దళితులు, గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపుతామన్నారు.

వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, బీడి కార్మికులకు, ఒంటరి మహిళలు, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు, ఎయిడ్స్ బాధితులకు, పైలేరియా డయాలిసిస్ పేషంట్లకు నెలకు రూ. 4 వేల పెన్షన్ ఇస్తామన్నారు. రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని మరోసారి హామీనిచ్చారు. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలు భర్తీ చేయడంతోపాటు రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందిస్తామన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు రూ.5 లక్షల వరకు వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ఇల్లు కట్టుకునే ప్రతీ పేదవాడికి రూ.5 లక్షల సాయం అందిస్తామన్నారు రేవంత్ రెడ్డి.

Next Story