జూబ్లీహిల్స్ అమ్నేషియా పబ్ ఘటనపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి బుధవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ జూబ్లీహిల్స్ లైంగిక దాడి కేసులో నిష్పక్షపాత విచారణ జరగాలని డిమాండ్ చేశారు. ఆరోపణలు ఎదర్కొంటున్న వారిని విచారించాలన్నారు. సీవీ ఆనంద్ కొన్ని విషయాలు బయటకు చెప్పకుండా దాచిపెట్టారని. బెంజ్ కారు యజమాని ఎవరో చెప్పలేదని.. ఇన్నోవా కారు ఎవరిదో కూడా సీవీ ఆనంద్ చెప్పలేదన్నారు. ప్రభుత్వ వాహనం అని స్టిక‍్కర్లు తొలగించింది ఎవరని ప్రశ్నించారు. ఇప్పటి వరకు వాహనాల యజమానులకు నోటీసులు ఎందుకు ఇవ్వలేదన్నారు.
పాత్రదారులు, సూత్రదారులు ఎవరన్నది సీవీ ఆనంద్ చెప్పడం లేదు. మైనర్‌ను లైంగిక దాడి చేసిన వాహనాల ఓనర్లను పిలిచి ఎందుకు విచారించలేదు. ఇన్నోవా కారులో బాలికను తీసుకెళ్లారు. ఆమెపై లైంగిక దాడి జరిగిందని చెబుతున్నారు. మైనర్లు వాహనం నడిపితే యజమానిదే బాధ్యత. కార్ల యజమానులపై ఎందుకు కేసు పెట్టలేదని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి.
జూబ్లీహిల్స్‌లోని అమ్నేషియా పబ్ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ ఘటనకు సంబంధించిన కేసులో ఏ-1గా ఉన్న సాదుద్దీన్‌ను పోలీసు కస్టడీకి కోర్టు అనుమతించింది. సాదుద్దీన్ కస్టడీ కోరుతూ నాంపల్లి కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేసింది. వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరారు. నేరం జరిగిన ప్రదేశంలో సీన్ రికన్‌స్ట్రక్న్ చేయాల్సి ఉందని ప్రాసిక్యూషన్ తన వాదనలో పేర్కొంది. ఇందుకోసం నిందితుడిని పోలీసు కస్టడీకి అప్పగించాలని తెలిపింది. మూడు రోజుల పాటు సాదుద్దీన్‌ను పోలీసు కస్టడీకి అనుమతిస్తూ నాంపల్లి కోర్టు నిర్ణయం తీసుకుంది.