అందుకే కాంగ్రెస్ కార్యాలయానికి నిప్పు పెట్టారు
TPCC President Revanth Reddy. మునుగోడు ఉప ఎన్నిక ఎన్నో చిత్ర, విచిత్రాలతో పాటు.. మరెన్నో కుట్రలకూ సాక్షంగా నిలుస్తోందని
By Medi Samrat Published on 11 Oct 2022 10:40 AM GMTమునుగోడు ఉప ఎన్నిక ఎన్నో చిత్ర, విచిత్రాలతో పాటు.. మరెన్నో కుట్రలకూ సాక్షంగా నిలుస్తోందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర అధికార పార్టీలు బీజేపీ, టీఆర్ఎస్ సంయుక్తంగా వ్యూహాలు రచిస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రచారానికి అడుగడునా ఇబ్బందులు సృష్టిస్తున్న విషయం తెలిసిందేనని అభిప్రాయపడ్డారు. అయితే, తాజాగా మునుగోడు నియోజకవర్గంలోని చండూర్లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఆ రెండు పార్టీలకు చెందినవారు దగ్ధం చేశారని తెలిపారు. మునుగోడులో కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేక ప్రత్యర్థులు దుష్ట చర్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ముఖ్యంగా టీపీసీసీ అధ్యక్షుడిగా చండూరులో తన పర్యటన నేపథ్యంలో సోమవారం అర్ధరాత్రి చండూరులో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంని తగలబెట్టి ధ్వంసం చేయడం దారుణమన్నారు. ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పార్టీ దిమ్మెలు కూల్చినా, పార్టీ కార్యాలయాలు తగులబెట్టినా.. మునుగోడు గడ్డపై ఎగిరేది కాంగ్రెస్ జెండానే అని ఆయన స్పష్టం చేశారు. ఇలాంటి దుర్మార్గపు చర్యలతో కాంగ్రెస్ గెలుపును ఆపలేరన్నారు. బీజేపీ, టీఆర్ఎస్‌లకు వణుకు పుట్టిందన్నారు. బెదిరిస్తే బెదిరేది లేదని స్పష్టం చేశారు. తమ పార్టీ కార్యాలయం మీద దాడి చేసిన వాళ్ళను 24 గంటల్లో అరెస్ట్ చేయాలని ప్రభుత్వాన్ని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.
లేనిపక్షంలో నల్గొండ ఎస్పీ కార్యాలయం ముందు తానే ధర్నా చేస్తానని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా టీఆర్ఎస్.. బీజేపీలకు వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహిస్తామన్నారు. ఈ ఘటనలో ఆఫీసులోని కండువాలు, పోస్టర్లు, బ్యానర్లతో పాటు ఇతర సామాగ్రి కాలి బూడిదైందని ఆయన మీడియాకు వివరించారు. విషయం తెలుసుకున్న స్థానిక నేతలు కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సత్వర విచారణ జరిపి నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని కోరారు.కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మంగళవారం చండూర్లో రేవంత్ సభ జరగనున్న విషయం తెలిసిందే.