తెలంగాణలో కుల గణన, ఎస్సీ వర్గకరణతో బీసీ, ఎస్సీల దశాబ్దాల కల సాకారమైందని పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్, మంత్రుల చొరవతో బీసీ కులగణన, ఎస్సీ వర్గకరణలకు మోక్షం లభించిందన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత బీసీ కులగణన జరిగిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. బీహార్ లాంటి రాష్ట్రాలు కులగణన చేపట్టినా కార్యరూపం దాల్చలేదన్నారు.
కుల గణన సర్వేపై ప్రతిపక్షాలు విమర్శలకు బదులు సలహాలు, సూచనలు చేస్తే బాగుంటుందన్నారు. శాస్త్రీయపద్ధతిలో కులగణన సర్వే జరిగిందన్నారు. 56 శాతంపైగా బీసీలు ఉన్నారని సర్వేలో తేలిందన్నారు. బీసీ సంఘాలను BRS నేతలు తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. ప్రతిపక్ష నేతల ట్రాప్‌లో బీసీ సంఘాలు పడొద్దన్నారు. పార్టీ లైన్ దాటితే ఎవరైనా సరే చర్యలు తప్పవని పరోక్షంగా తీన్మార్ మల్లన్ననుద్దేశించి హెచ్చరికలు జారీ చేశారు. పార్టీలైన్ దాటి మాట్లాడినవారిపై.. క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకుంటుందని అన్నారు.