హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డితో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ సమావేశం ముగిసింది. దాదాపు గంటన్నరకు పైగా ఇరువురి సమావేశం జరిగింది. కీలక అంశాలపై సుదీర్ఘ చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఈ నెల 16 లేదా 17 తేదీలలో టీపీసీసీ పీఏసీ సమావేశం ఉండే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. పీఏసీ సమావేశంలో మెజారిటీ నాయకుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని 42 శాతం బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకోవాలని అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం.
బోర్డ్, కార్పొరేషన్ డైరెక్టర్ ల పోస్టుల నియామకాలను సాధ్యమైనంత త్వరగా ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన అంశాలు, వ్యూహాల గురించి చర్చించారు. జనహిత పాదయాత్ర సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిష్కారాలపై చర్చించిన ఇరువురు నాయకులు చర్చించారు. ప్రజా పాలనలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా ప్రచారంలోకి తీసుకువెళ్లాలనే అంశాలపైన ఇరువురు నాయకులు చర్చించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.