పీసీసీ అధ్యక్షుడిగా ఆ కోరిక ఉంది..!
తెలంగాణలో మరోసారి వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.
By - Medi Samrat |
తెలంగాణలో మరోసారి వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఢోకా లేదని.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. మంత్రులతో పాటు ఇంచార్జ్ బాధ్యతలు ఉన్న ప్రతీ ఒక్కరూ బాగా పని చేశారన్నారు. పోలింగ్ పర్సంటెజ్ పెరిగి ఉండాల్సిందని.. పట్టణ ప్రజలు, యువత ముందుకు వచ్చి ఓటువేయాల్సిందని అభిప్రాయపడ్డారు. రిగ్గింగ్ చేయడం పాజిబుల్ కాదు. ఇది పాత జమానా కాదని.. ఓడిపోతున్నామనే బాధతో BRS వాళ్లు అలా మాట్లాడుతున్నారన్నారు.
దేశంలో ఎక్కడ లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని.. అది జూబ్లీహిల్స్‌లో మా పార్టీ అభ్యర్థికి కూడా ప్లస్ పాయింట్‌గా మారిందన్నారు. ప్రస్తుతం తెలంగాణలో పాజిటివ్ వేవ్ కనిపిస్తుందని.. మళ్లీ వచ్చేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు. లోకల్ బాడీ ఎన్నికలు కూడా త్వరలో జరగనున్నాయని.. హైకోర్టు ఆదేశాల మేరకు ముందుకు వెళ్తామన్నారు. అలాగే మరోసారి ఏఐసీసీతో మాట్లాడి.. లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్తామన్నారు. లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలి. రెండు, మూడు రోజుల్లో అందరం కూర్చొని మాట్లాడి ముందుకు వెళ్తామన్నారు.
బీసీలకు 42 శాతం చట్టబద్ధంగా చేయాలని అనుకున్నాం.. కానీ కేంద్రంలోని బీజేపీ అడుగడుగునా అడ్డం పడుతుందన్నారు. కేబినెట్ విస్తరణ సీఎం, పార్టీ అధిష్టానం చూసుకుంటుందన్నారు. ఏ ఎన్నికలైనా సరే గెలుపు కాంగ్రెస్ పార్టీదేనన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని పార్టీ కార్యకర్తలు ధీమాతో చెబుతున్నారన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ తపన అన్నారు. బీసీలు బాగుపడొద్దు అన్న వైఖరితో బండి సంజయ్,కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారన్నారు.
డీసీసీ అధ్యక్షుల ప్రకటన ఏ క్షణమైనా రావొచ్చన్నారు. సోషల్ మీడియా ఫేక్ ప్రచారం టెంపరరీ గేమ్ మాత్రమేనన్నారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో పెయిడ్ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా ఫేక్ సర్వేలకు బీఆర్ఎస్ పూనుకుందని ఆరోపించారు.
పదవి కావాలని ఏ రోజు అడిగింది లేదు.. పీసీసీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి రావాలని కోరిక ఉందన్నారు. మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసి సోనియా గాంధీకి గిఫ్ట్ ఇవ్వాలని కోరిక అన్నారు. బీహార్‌లో మహాఘట్ బంధన్ గెలుస్తుందని నమ్మకం ఉందన్నారు. త్వరలో ఓట్ చోరీపై కమిటీ వేస్తామని.. ఓట్ చోరీని అధిగమించి గెలవాలన్నదే కాంగ్రెస్ పార్టీ తాపత్రయం అన్నారు.