పేదల పొట్ట కొట్టి కార్పోరేట్ శక్తులను పెంచి పోషించడమే బీజేపీ విధానం

ఉపాధి హామీ పథకానికి గాంధీ పేరు తొలగించడం హేయమైన చర్య అని పీసీసీ ఛీఫ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.

By -  Medi Samrat
Published on : 3 Jan 2026 8:40 PM IST

పేదల పొట్ట కొట్టి కార్పోరేట్ శక్తులను పెంచి పోషించడమే బీజేపీ విధానం

ఉపాధి హామీ పథకానికి గాంధీ పేరు తొలగించడం హేయమైన చర్య అని పీసీసీ ఛీఫ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. శాసన మండలిలో ఆయ‌న మాట్లాడుతూ.. మహాత్మాగాంధీ మన దేశంలోనే కాదు.. ప్రపంచం గర్వించదగ్గ త్యాగశీలి అన్నారు. ఉపాధి హామీ చట్టంలో మార్పులు తేవడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. కేంద్రం తప్పుడు చరిత్రను రాసే ప్రయత్నం చేస్తుందన్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన గాంధీ, దేశ స్వాతంత్యం కోసం 12 ఏళ్ళు జైలు జీవితం గడిపిన నెహ్రూలను మరిపించే ప్రయత్నం చేస్తుందన్నారు. దేశంలో వలసల నివారణ కోసం ప్రధానమంత్రి, సోనియా గాంధీ తీసుకువచ్చిన గొప్ప చట్టం ఇది.. పేదలకు ఉపాధి హక్కును కల్పించి జీవనోపాధిని కల్పించిందన్నారు. 20 ఏళ్ళుగా కోట్ల మంది ఆకలి తీర్చిన చట్టం ఇది.. ఉపాధి హామీ పనుల్లో 90 శాతం మంది లబ్ధిదారుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలే ఉన్నార‌న్నారు. 62 శాతం మంది మహిళలు లబ్ది పొందారు. పేదలకు ఆపన్న హస్తంలా నిలిచిన ఉపాధి హామీని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తూ వస్తుందన్నారు. ఒక్క‌ తెలంగాణలోనే గత ఏడాది 6 కోట్ల పనిదినాలు తగ్గించారు. పేదల పొట్ట కొట్టి కార్పోరేట్ శక్తులను పెంచి పోషించడమే బీజేపీ విధానం అన్నారు. పెట్రోల్, డీజీల్ రేట్ మూడింతలు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్ క్రూడాయిల్ ధరలు తగ్గినా.. దేశంలో రేటు పెరుగుతుందన్నారు. కేంద్ర ఆర్థిక విధానాల వల్ల రాష్ట్రాల ఆదాయ వనరులు తగ్గాయి.. ఇది చాలదు అన్నట్లు ఉపాధి హామీ నిధుల్లో 40 శాతం భారం వేయడం అన్యాయం అన్నారు. కేంద్రం చర్యల వల్ల ఒక్క తెలంగాణ మీదే 1800 కోట్ల అదనపు భారం పడుతుందన్నారు.

Next Story