మోదీని ఒప్పించే దమ్ముందా.? బండి సంజయ్‌కు టీపీసీసీ చీఫ్‌ సవాల్

బండి సంజయ్‌కు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ సవాల్ విసిరారు.

By Medi Samrat  Published on  17 Feb 2025 2:45 PM IST
మోదీని ఒప్పించే దమ్ముందా.? బండి సంజయ్‌కు టీపీసీసీ చీఫ్‌ సవాల్

బండి సంజయ్‌కు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ సవాల్ విసిరారు. గాంధీ భవన్ ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయ‌న‌ మాట్లాడుతూ.. 42 శాతం రిజర్వేషన్ల చట్ట బద్దత కోసం ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి బిల్లును శాసన సభలో ప్రవేశపెడతాం.. బిల్లును 9వ షెడ్యూల్‌లో చేర్చడం కోసం ప్రధాని మోదీని ఒప్పించే దమ్ముందా బండి సంజయ్.? అని స‌వాల్ విసిరారు. దేశ వ్యాప్తంగా జనగణనతో కులగణన నిర్వహించాలని మోదీని అడిగే సత్తా ఉందా.? అని ప్ర‌శ్నించారు.

42 శాతం రిజర్వేషన్ల చట్ట బద్దత కోసం శాసన సభలో బిల్లు ప్రవేశపెట్టడమే కాకుండా పార్టీలకు అతీతంగా నాయకులను తీసుకొని మోదీని కలుస్తామ‌న్నారు. కుల గణనతో బీసీలకు కొత్త అధ్యాయం మొదలైందన్నారు. బీసీల్లో ఐక్యత లోపించింది.. బీసీలు ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలోనైనా...రాష్ట్రంలోనైనా భవిష్యత్ బీసీలదేన‌న్నారు.

బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు బీసీ నాయకుడిని సీఎం చేయగలరా.? అని స‌వాల్ విసిరారు. బీసీ నాయకుడిని సీఎం చేసే సత్తా కాంగ్రెస్ పార్టీకే ఉందన్నారు. రాహుల్ గాంధీ ఆశయం మేరకు కుల గణన సర్వే నిర్వహించడం జరిగింది. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ నా ఆధ్వర్యంలో ప్రవేశ పెట్టడం జరిగింది.. బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ ను తొలగిస్తే పార్టీలకు అతీతంగా స్పందించామ‌న్నారు.

కమిషన్ల కోసం ప్రాజెక్టులు కట్టిన చరిత్ర కేసీఆర్ కుటుంబానిది.. బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ నేతలకు లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సోషల్ మీడియాపై ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందన్నారు.

Next Story