కులగణన సర్వే, ఎస్సీ వర్గీకరణ చారిత్రాత్మక నిర్ణయాలు అని పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అభివృద్ది, సంక్షేమం రెండు కళ్ల సిద్ధాంతంతో కాంగ్రెస్ పాలన సాగుతోందన్నారు. స్వాతంత్ర్యం వచ్చాక దేశంలో తొలిసారిగా కులగణన సర్వేను సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసిందన్నారు. పదేళ్ల కాంగ్రెస్ కార్యకర్తల కృషితో పార్టీ అధికారంలోకి వచ్చింది.. సీఎం రేవంత్, మంత్రుల బృందం చిత్త శుద్ధితో పాలనను సాగిస్తోందన్నారు.
రాహుల్ గాంధీ ఆలోచన, ఆశయం మేరకు కులగణను సర్వే నిర్వహించామని.. 40 ఏళ్ల కలను సాకారం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు. పీసీసీ కార్యవర్గంతో పాటు ఇతర పదవులను భర్తీ కోసం కసరత్తు జరుగుతుందన్నారు. కులగణన సర్వేను శాస్త్రీయ బద్దంగా ప్రభుత్వం నిర్వహించిందన్నారు. కుల సర్వే పై ప్రతిపక్షాలు పనికట్టుకొని అసత్యాలు ప్రచారం చేస్తున్నాయని.. కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది కార్యకర్తలు తండ్రి మీద కొడుకు వలె అలక బూనిన మాట వాస్తవం.. వారందరికి న్యాయం జరిగేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కుల సర్వే, ఎస్సీ వర్గీకరణనను గురించి ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల మీద ఉందన్నారు.