రేవంత్ రెడ్డి అరెస్ట్.. ఘట్‌కేసర్‌లో ఉద్రిక్తత
TPCC Leader Revanth Reddy Arrest. నిన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన కాల్పుల సంఘటనలో మరణించిన
By Medi Samrat Published on 18 Jun 2022 7:53 AM GMTనిన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన కాల్పుల సంఘటనలో మరణించిన రాకేష్ కుటుంబాన్ని పరామర్శించేందుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నర్సంపేటకు వెళ్తుండగా ఘట్‌కేసర్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసి ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ నేపథ్యంలో పోలీసులకు రేవంత్ రెడ్డికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తను మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడినని.. ఈ ప్రాంతం తన నియోజకవర్గంలో ఉందని.. ఎలా అడ్డుకుంటారని రేవంత్ రెడ్డి పోలీసులను నిలదీశారు.
ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసి తరలిస్తున్న వాహనాన్ని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, కాంగ్రెస్ నాయకులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో ఘట్‌కేసర్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది.
రేవంత్ రెడ్డి అరెస్టు అత్యంత దుర్మార్గమని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు. కేసీఆర్, మోడీ కుమ్మక్కై కాంగ్రెస్ నేతలను అరెస్టులు చేస్తున్నారని విమర్శించారు. మరణించిన రాకేష్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తుంటే అరెస్టులు చేస్తారా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి నర్సంపేట కు రాజకీయాల కోసం వెళ్లడం లేదని వెల్లడించారు. భారత సంస్కృతి లో బాధితులను పరామర్శించడం ఒక సంప్రదాయం అని అన్నారు.
రేవంత్ రెడ్డి ఎక్కడకు వెళ్లినా టిఆర్ఎస్, బీజేపీ లు వెంటపడి అరెస్టులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ, టీఆర్ఎస్ కుమ్మక్కై కలిసి రాజకీయం చేస్తున్నట్టు స్పష్టంగా అర్థం అవుతుందని సందేహం వ్యక్తం చేశారు. ప్రజల కోసం పనిచేస్తున్న వారిని అరెస్టులు చేస్తే ప్రజలు మిమ్మల్ని అరెస్టులు చేస్తారని హెచ్చరించారు. ప్రజలు మీ గద్దెలు దించే రోజులు ఎంతో దూరం లో లేవని అన్నారు.