రేవంత్ రెడ్డి అరెస్ట్‌.. ఖండించిన కాంగ్రెస్ నేత‌లు

TPCC Leader Revanth Reddy Arrest. కాంగ్రెస్ ఎంపీ, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు.

By Medi Samrat  Published on  17 Feb 2022 4:44 AM GMT
రేవంత్ రెడ్డి అరెస్ట్‌.. ఖండించిన కాంగ్రెస్ నేత‌లు

కాంగ్రెస్ ఎంపీ, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. జూబ్లీహిల్స్ ఇంటి వద్ద పోలీసులు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు. సీఎం కేసీఆర్ జ‌న్మ‌దినం సందర్భంగా టీపీసీసీ ఈ రోజు నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఈ నేప‌థ్యంలోనే పోలీసులు రేవంత్ రెడ్డిని అరెస్టు చేశారు. రేవంత్ రెడ్డి అరెస్టు సందర్భంగా పోలీసులను కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో రేవంత్ రెడ్డి ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెల‌కొంది. కార్యకర్తలకు పోలీసులతో వాగ్వాదం జ‌రిగింది. ఈ నేప‌థ్యంలో కార్యకర్తలను అడ్డు తప్పించి రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు పోలీసులు.

కాంగ్రెస్ నేత‌లు మహేష్ కుమార్ గౌడ్, మల్లు రవి.. రేవంత్ రెడ్డి అరెస్టును త‌ప్పుబ‌ట్టారు. రేవంత్‌ అరెస్ట్ అక్రమం.. అప్రజాస్వామికం అంటూ మండిప‌డ్డారు. రేవంత్ రెడ్డి అరెస్టును తీవ్రంగా ఖండించారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం నిర్బంధ కాండ అమలు చేస్తోందని దుయ్య‌బ‌ట్టారు. ప్రతిపక్ష నాయకులు గొంతు నులుముతుందని.. కేసీఆర్ తెలంగాణలో సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్రతి రోజు అరెస్ట్ లు ఏంట‌ని ప్ర‌శ్నించారు. ప్రధాన ప్రతిపక్ష నాయకులకు మాట్లాడే హక్కు కూడా ఉండకుండా చేస్తున్నారని.. ప్రజాస్వామిక వాదులు, తెలంగాణ మేధావులు అందరూ ఖండించాలని పిలుపునిచ్చారు. ఇంత నిర్బంధ కాండ ఎప్పుడు లేదని.. ఇంత దుర్మార్గమా.. ప్రజలు చూస్తున్నారు.. తగిన బుద్ధి చెపుతారని టీపీసీసీ వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్‌ మహేష్ కుమార్ గౌడ్, టీపీసీసీ ఉపాధ్య‌క్షులు మల్లు రవి అన్నారు.

Next Story
Share it