దేశ సమగ్రతను కాపాడేందుకే రాహుల్ పాదయాత్ర : రేవంత్

TPCC Leader Revanth Reddy About Bharat Jodo Yatra. దేశ సమగ్రతను కాపాడేందుకే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను ప్రారంభించారన్నారు

By Medi Samrat  Published on  22 Oct 2022 7:49 PM IST
దేశ సమగ్రతను కాపాడేందుకే రాహుల్ పాదయాత్ర : రేవంత్

దేశ సమగ్రతను కాపాడేందుకే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను ప్రారంభించారన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. రేపు తెలంగాణలోకి రాహుల్ పాదయాత్ర ప్రవేశిస్తున్న నేపథ్యంలో యాత్ర ఏర్పాట్లను పరిశీలించారు. మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ లో రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్, కాంగ్రెస్ నేతలతో కలిసి యాత్ర ప్రారంభమయ్యే ప్రదేశం, ఇతర ఏర్పాట్లను పరిశీలించారు. గత డెబ్భై ఐదేళ్లలో ఎన్నడూ లేని విధంగా మోదీ ప్రభుత్వం దేశాన్ని విశ్చిన్నం చేసే కుట్ర చేస్తోందని ఆయన విమర్శించారు. మతం పేరుతో బీజేపీ విద్వేశాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందన్నారు. కాంగ్రెస్ భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా మారిస్తే.. బీజేపీ దేశ సమగ్రతను దెబ్బతీసేలా వ్యవహరిస్తోందని ఆరోపించారు. బీజేపీ కుట్రలను తిప్పికొట్టేందుకే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నిర్వహిస్తున్నారన్నారు.

కుల, మతాలకు అతీతంగా రాహుల్ పాద యాత్రకు మద్దతు తెలపాలని కోరారు. దేశంలో ప్రభుత్వ సంస్థలను మోదీ పెట్టుబడిదారులైన అదానీ, అంబానీలకు కట్టబెట్టారని ఆరోపించారు. స్వాతంత్ర్య సాధనకు గాంధీ దండియాత్రలా.. దేశ సమైక్యతను కాపాడేందుకు భారత్ జోడో యాత్ర అని అన్నారు. గాంధీ సూర్తితో రాహుల్ పాదయాత్ర చేస్తున్నారు. ఈ యాత్రలో పాల్గొనడం తమ అదృష్టగా భావిస్తున్నామన్నారు. ఇది భావి తరాలకు చెప్పుకునే చారిత్రాత్మక సందర్భమని తెలిపారు రేవంత్. రేపు ఉదయం 7గంటలకు రాహుల్ గాంధీ యాత్ర తెలంగాణలోకి ప్రవేశిస్తుందని తెలిపారు. పాదయాత్రలో పాల్గొనేవారు ఉదయం 6గంటకల్లా మక్తల్ కృష్ణా నది బ్రిడ్జి వద్దకు చేరుకోవాలన్నారు. రాహుల్ గాంధీ గారికి అఖండ స్వాగతం పలికి యాత్రను విజయవంతం చేయాలని కోరారు.


Next Story