కవితను జైలులో పెట్టి సానుభూతి పొందాలని.. మోదీతో కేసీఆర్ ఒప్పందం: రేవంత్‌ రెడ్డి

అధికార బీఆర్‌ఎస్‌, బీజేపీ, ఎంఐఎం పార్టీలపై రేవంత్‌ రెడ్డి నిప్పులు చెరిగారు. బీఆర్‌ఎస్‌, ఎంఐఎం బీజేపీకి పరోక్ష మద్దతుదారులని ఆరోపించారు.

By అంజి  Published on  17 Sept 2023 10:32 AM IST
TPCC, Revanth Reddy, BJP, BRS, Telangana

కవితను జైలులో పెట్టి సానుభూతి పొందాలని.. మోదీతో కేసీఆర్ ఒప్పందం: రేవంత్‌ రెడ్డి 

హైదరాబాద్‌: అధికార బీఆర్‌ఎస్‌, బీజేపీ, ఎంఐఎం పార్టీలపై టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి నిప్పులు చెరిగారు. బీఆర్‌ఎస్‌, ఎంఐఎం బీజేపీకి పరోక్ష మద్దతుదారులని ఆరోపించారు. సీడబ్యూసీ సమావేశాలు ఇక్కడ ఏర్పాటు చేయడంతో తెలంగాణకు ఎంతో కీలకమని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి అన్నారు. 2024 ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన విధానాలపై నిన్న సీడబ్ల్యూసీ సమావేశంలో చర్చించామని తెలిపారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలపై ఇవాళ జరిగే సమావేశంలో చర్చిస్తామన్నారు. సాయంత్రం జరిగే విజయభేరిలో సోనియాగాంధీ గ్యారంటీలను ప్రకటిస్తారన్నారు. బోయిన్ పల్లి రాజీవ్ గాంధీ నాలెడ్జ్ సెంటర్ కు సభలోనే శంఖుస్థాపన చేస్తారని, తెలంగాణ ఇస్తామని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నట్టే.. ఇవాళ విజయభేరిలో ఇవ్వబోయే గ్యారంటీలను కాంగ్రెస్ అమలు చేస్తుందన్నారు. అధికారంలోకి వచ్చిన మొదటి వంద రోజుల్లో పథకాలు అన్నీ అమలు చేసేలా గ్యారెంటీ ఇవ్వబోతున్నామని రేవంత్‌ పేర్కొన్నారు.

సాయంత్రం తుక్కుగూడలో జరిగే విజయభేరి సభకు లక్షలాదిగా తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. కాళేశ్వరం అక్రమ సొమ్ముతో ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో బీఆర్‌ఎస్‌ పెట్టుబడులు పెట్టిందని రేవంత్‌ ఆరోపించారు. వాటాలు పొందుతున్న బీజేపీ కాంగ్రెస్‌ను నిందించడం తప్ప ఏం చేయగలరని ప్రశ్‌నించారు. తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్‌ను విమర్శిస్తున్నారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ చీకటి ఒప్పందాన్ని ప్రజలు గమనిస్తున్నారని, సానుభూతి పవనాలతో ఎన్నికల్లో మళ్లీ గెలవాలని కేసీఆర్‌ చూస్తున్నారని అన్నారు. ఎన్నికల్లో గెలిచేందుకు కూతురిని కూడా అరెస్టు చేయించి సానుభూతి పొందాలనుకునే రకమైన వ్యక్తి కేసీఆర్ అని అన్నారు. కవితను తీహార్ జైలులో పెట్టి సానుభూతి పొందాలని మోదీతో కేసీఆర్ ఒప్పందం చేసుకున్నారని, ఇందుకు కేసీఆర్ మోదీకి సహకరిస్తున్నారని రేవంత్‌ అన్నారు. ఏ లక్ష్యంతో సోనియా తెలంగాణ ఇచ్చారో ఆ లక్ష్యం నెరవేరలేదని, ఆ లక్ష్యాన్ని, కలను నెరేవేర్చేందుకే ఇవాళ విజయభేరి సభ అని తెలిపారు.

ఎంఐఎం, బీఆరెస్, బీజేపీ సభలకు లేని ఆంక్షలు కాంగ్రెస్ కే ఎందుకు? అని రేవంత్‌ ప్రశ్నించారు. కొంతమంది పోలీసులు బీఆర్‌ఎస్‌ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ పాలమూరు ప్రాజెక్టు ప్రారంభించడం.. కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా ఉందని ఎద్దేవా చేశారు. ఆర్భాటం కోసమే కేసీఆర్ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభించారని అన్నారు. కేసీఆర్, కిషన్ రెడ్డి వేర్వేరు కాదని, ఒక్కొక్కరుగా ఎదుర్కోలేకనే బీజేపీ, బీఆరెస్, ఎంఐఎం మూకుమ్మడిగా కాంగ్రెస్ పై దాడికి దిగుతున్నాయని అన్నారు. అందుకు నిదర్శనమే ఇవాళ ఆ మూడు పార్టీల సభలు, కార్యక్రమాలు అని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వంపై బీజేపీ ఈగ వాలనివ్వడం లేదని, ఈడీ, సీబీఐ ఒక్క కేసు కూడా పెట్టలేదన్నారు. కేసీఆర్‌ అవినీతిపై ఎందుకు విచారణకు ఆదేశించలేదు? రేవంత్‌ కేంద్రాన్ని ప్రశ్నించారు. కేజ్రీవాల్ ప్రభుత్వంపై ఈడీ కేసులో కవిత ఇరుక్కున్నారని, అంతేగాని బీఆరెస్ ప్రభుత్వంపై ఒక్క కేసు కూడా పెట్టలేదన్నారు. సోనియాను, రాహుల్ ను ఈడీ వేధించింది కనిపించడం లేదా? అని నిలదీశారు. రూ.100 కోట్లకే మంత్రులను జైలుకు పంపితే.. మరి లక్ష కోట్లు తిన్న కేసీఆర్‌ను ఏం చేయాలని రేవంత్‌ ప్రశ్నించారు.

Next Story