హైదరాబాద్: కాళేశ్వరం విచారణ నుంచి తప్పించుకునేందుకే బీజేపీ నేతల అడుగులకు బీఆర్ఎస్ మడుగులు ఒత్తుతోంది..అని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. గాంధీభవన్‌లో టీపీసీసీ చీఫ్ మీడియాతో మాట్లాడుతూ... కేటీఆర్ మీ స్థాయికి మించి మాట్లాడుతున్నారు. అసలు నీ స్థాయి ఏంటి? దేశం కోసం సర్వం త్యాగం చేసిన గాంధీ కుటుంబం గురించి మాట్లాడే స్థాయి నీకు ఉందా? కేటీఆర్ వ్యాఖ్యల వెనక బీజేపీ నేతలు ఉన్నారు. మోదీ మెప్పుకోసం రాహుల్‌గాంధీపై కేటీఆర్ విమర్శలు చేస్తున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సుదర్శన్‌రెడ్డికి మద్దతు తెలకపోయినప్పుడే మీ వైఖరి బట్టబయలైంది. మీరు పరోక్షంగా ఎన్డీయేకు మద్దతు తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీ వేర్వేరు కాదు..కవిత వ్యాఖ్యలతో బీజేపీలో, బీఆర్ఎస్ మానసికంగా విలీనమైందని స్పష్టం అయింది..అని మహేశ్ కుమార్ ఆరోపించారు.
ఎమ్మెల్యేల ఫిరాయింపు గురించి రాహుల్ ఎందుకు స్పందిస్తారు కేటీఆర్? అది స్పీకర్ పరిధిలోని అంశం. కాళేశ్వరం సీబీఐ విచారణ తప్పించుకునేందుకు బిఆర్ఎస్ నేతల అగచాట్లు. కాళేశ్వరం కేసు విచారణ సిబిఐకి ఇవ్వమని కోరిన కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎందుకు స్పందించడం లేదు. మనువాద రాజ్యాంగాన్ని అమలు చేయాలని బీజేపీ కుటిల ప్రయత్నం. కాళేశ్వరం అవినీతిపై సీబీఐ సమగ్ర విచారణ జరపాలి. 48 గంటల్లో కాళేశ్వరం అవినీతిని తేలుస్తామని అన్న కిషన్ రెడ్డి ఎందుకు సైలెంట్ అయ్యారు. బీజేపీలో, బిఆర్ఎస్ విలీనంలో భాగంగానే కాళేశ్వరం పై విచారణ ఆగిందని భావిస్తున్నాం..అని టీపీసీసీ చీఫ్ వ్యాఖ్యానించారు.