బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై మహేష్ కుమార్ గౌడ్ సంచలన ఆరోపణలు

తెలంగాణలో బీఆర్‌ఎస్‌ దుకాణం బంద్‌ అయిందని టీపీసీసీ చీఫ్‌, ఎమ్మెల్సీ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ అన్నారు. ఫాంహౌస్‌కే పరిమితం అయిన కేసీఆర్‌కు ప్రతిపక్ష హోదా ఎందుకని ప్రశ్నించారు.

By అంజి  Published on  10 Feb 2025 12:17 PM IST
TPCC chief, Mahesh Kumar Goud, BJP, BRS, Telangana

బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై మహేష్ కుమార్ గౌడ్ సంచలన ఆరోపణలు

తెలంగాణలో బీఆర్‌ఎస్‌ దుకాణం బంద్‌ అయిందని టీపీసీసీ చీఫ్‌, ఎమ్మెల్సీ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ అన్నారు. ఫాంహౌస్‌కే పరిమితం అయిన కేసీఆర్‌కు ప్రతిపక్ష హోదా ఎందుకని ప్రశ్నించారు. గజ్వేల్‌ నియోజకవర్గ ప్రజలను పట్టించుకోవాల్సిన కేసీఆర్‌.. ఫాంహౌస్‌లో సేద తీరుతున్నారని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్‌ఎస్‌ దోస్తీ చేస్తున్నాయని మహేష్‌ కుమార్‌ గౌడ్‌ ఆరోపించారు. ఇవాళ గజ్వేల్ రిమ్మన్నగూడ ఎస్ -4 వద్ద మహేష్ కుమార్ గౌడ్ మీడియా మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్ధి నరేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఓడగొట్టడానికి బీఆర్ఎస్‌- బీజేపీ లోపాయికారి ఒప్పందం చేసుకున్నాయని మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. ఎంపీ ఎన్నికల మాదిరిగానే ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ప‌రోక్షంగా బీజేపీ బీఆర్ఎస్‌ పార్టీ సపోర్ట్‌ చేస్తోందని మహేష్‌ కుమార్‌ గౌడ్‌ ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీఆర్ఎస్‌కు అభ్యర్థులే దొరకడం లేదని అన్నారు. రాష్ట్రం నుండి బీజేపీకి ఎనిమిది మంది ఎంపీలు ఉంటే బడ్జెట్‌లో రాష్ట్రానికి వచ్చిన నిధులు గాడిద గుడ్డు అని ఫైర్‌ అయ్యారు. ఇక్కడి బీజేపీ నాయకులకు మతం పేరిట ప్రజలను రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందండం సంప్రదాయంగా వస్తోందని ఆరోపించారు.

స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలోనే మొదటి సారిగా తెలంగాణలో కులగణన సర్వే నిర్వహించామన్నారు. కుల గణన సర్వేతో దేశానికి ఆదర్శంగా నిలిచామని ఉద్ఘాటించారు. పారదర్శకంగా కులగణన సర్వే నిర్వహించామని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్‌లో కేటీఆర్ - కవిత - హరీష్ మధ్య మూడు ముక్కలాట నడుస్తోందని విమర్శలు చేశారు. బీసీల గురించి బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు.

Next Story