కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ నిరసన చేపట్టింది. హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై అంబేద్కర్ విగ్రహం వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌గౌడ్‌తో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
నిరసన కార్యక్రమంలో టీపీసీసీ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. కేంద్రప్రభుత్వం బీజేపీ పాలిత రాష్ట్రాలకు నిధులు కేటాయిస్తూ.. తెలంగాణకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా మోడీ సర్కార్ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. దేశాభివృద్ధికి తెలంగాణ రాష్ట్రం ఎంతో సహాయపడుతుంటే.. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం పట్ల వివక్ష చూపించిందన్నారు. రాజకీయాలకు అతీతంగా కేంద్రం మెడలు వంచేందుకు అన్ని పార్టీలు కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. కేంద్రం వివక్షను ప్రజాక్షేత్రంలోనే ఎండగట్టాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో చేపడుతున్న వివిధ ప్రాజెక్టులకు సాయం చేయాలని పలుసార్లు కేంద్రానికి నివేదికలు ఇచ్చినా పట్టించుకోలేదని విమర్శించారు. తెలంగాణ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండి ఏం ప్రయోజనం అని.. మహేశ్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. రాష్ట్రానికి నిధులు కేటాయించకపోవడంపై నోరు మెదపరా అంటూ వ్యాఖ్యానించారు.