రైతన్నలూ.. దయచేసి ధైర్యం కోల్పోకండి.. వచ్చేది మన ప్రభుత్వమే: కేటీఆర్
తెలంగాణలో ఒకే రోజు ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు అన్నారు.
By - అంజి |
రైతన్నలూ.. దయచేసి ధైర్యం కోల్పోకండి.. వచ్చేది మన ప్రభుత్వమే: కేటీఆర్
తెలంగాణలో ఒకే రోజు ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు అన్నారు. సమైక్యరాష్ట్రంనాటి సంక్షోభ పరిస్థితులు తెలంగాణవ్యాప్తంగా నెలకొని ఉన్నాయనడానికి వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఈ ఘటనలే నిదర్శనం అన్నారు. ఈ మరణాలకు కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని, వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.25 లక్షల చొప్పున తక్షణ ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు.
''ఆదిలాబాద్, మెదక్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ముగ్గురు రైతుల నిండు ప్రాణాలను పొట్టన పెట్టుకున్న పాపం ముమ్మాటికీ ఈ చేతకాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదే. భూపాలపల్లిలో కోడెల సదానందం, మెదక్ లో దేవ్ సోత్ సర్వేశ్, ఆదిలాబాద్ లో జాదవ్ అంకుష్ కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే 25 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించి ఆదుకోవాలి. ఈ ముగ్గురు రైతుల ఆత్మహత్యలకు అప్పులే ప్రధాన కారణం కావడం, రేవంత్ సర్కారు మోసాలను, అబద్ధపు హామీల పేరిట చేసిన తీరని ద్రోహాన్ని అడుగడుగునా ఎత్తిచూపుతోంది'' అని కేటీఆర్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
రుణమాఫీ పేరిట చేసిన నయవంచనకు తోడు, పెట్టుబడి సాయానికి పాతరేయడం, చివరికి యూరియాను కూడా ఎగ్గొట్టి దిగుబడిని దెబ్బతీయడంతో కాంగ్రెస్ పాలనలో తెలంగాణ అన్నదాత పరిస్థితి అనాథలా మారిందన్నారు. కేవలం రెండేళ్ల కాలంలోనే దాదాపు 900 మంది రైతులు గుండెపగిలి బలవన్మరణాలకు పాల్పడినా ఈ సర్కారుకు ఇప్పటికీ సోయి రాలేదని ఫైర్ అయ్యారు. పదేళ్లు ధైర్యంగా బతికిన రైతు కుటుంబాల్లో ఇవాళ మోగుతున్న ఈ మరణమృదంగానికి రేవంత్ సర్కారు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. అన్నదాతలారా.. దయచేసి ధైర్యం కోల్పోకండి. మరో మూడేళ్లు ఓపిక పట్టండి. ఈ వ్యవసాయ వ్యతిరేక కాంగ్రెస్ పార్టీని, రైతు ద్రోహి రేవంత్ ను గద్దెదించుదాం. మన తెలంగాణలో వ్యవసాయరంగానికి మళ్లీ మంచిరోజులు తెచ్చుకుందాం అని పేర్కొన్నారు.