మైదా-ఉప్పుతో పైల్స్ ను తగ్గిస్తారట.. అదుపులోకి తీసుకున్న అధికారులు
మోసపూరిత వైద్య విధానాలకు పాల్పడుతున్న వ్యక్తులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
By Medi Samrat Published on 22 Nov 2024 9:30 AM ISTమోసపూరిత వైద్య విధానాలకు పాల్పడుతున్న వ్యక్తులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వరంగల్‌లో ఆయుర్వేద వైద్యులుగా నటిస్తున్న ముగ్గురు వ్యక్తులను తెలంగాణ రాష్ట్ర వైద్య మండలి (TGMC) పట్టుకుంది. ఈ నకిలీ వైద్యులు మైదా, ఉప్పుతో తయారు చేసిన ఇంట్లో తయారుచేసిన లేపనాలను ఉపయోగించి పైల్స్ చికిత్స చేస్తూ ఉన్నారు. ఇందుకు రూ.10,000 నుండి రూ.20,000 వరకు వసూలు చేస్తున్నారు. ఎలాంటి ఆమోదం లేకుండా చేస్తున్న ఈ చికిత్సల కారణంగా చాలా మంది రోగులు దారుణమైన పరిస్థితులను అనుభవించారు.
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) సహకారంతో టీజీఎంసీ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌లో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరంతా కోల్‌కతాకు చెందిన వారని, తెలంగాణ ఆయుష్ కౌన్సిల్, జిల్లా రిజిస్ట్రేషన్ అథారిటీ లేదా జిల్లా ఆరోగ్య శాఖ నుండి సరైన రిజిస్ట్రేషన్ లేదా అనుమతి లేకుండా పనిచేస్తున్నట్లు వెల్లడైంది.
నిందితుల్లో ఒకరు మారుతీ క్లినిక్‌ను నిర్వహిస్తున్న ఆర్‌కె బిస్వాస్ ను అదుపులోకి తీసుకున్నారు. పేషెంట్ మలంలో రక్తం ఉన్నట్లుగా చూపించి చికిత్స కోసం రూ.20,000 వసూలు చేస్తూ పట్టుబడ్డాడు. వరంగల్‌లోని హనుమాన్ దేవాలయం వద్ద ఉన్న చికిత్స కేంద్రంపై వేర్వేరుగా దాడులు నిర్వహించగా, ఇద్దరు అదనపు నకిలీ వైద్యులు ఏకే సర్కార్, ఎస్కే సర్కార్‌లుగా గుర్తించారు.