బీసీ బిల్లుల సాధన కోసం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇందిరా పార్క్ వద్ద నిర్వహించనున్న 72 గంటల నిరాహార దీక్ష పోస్టర్‌ను బుధవారం బంజారాహిల్స్‌లోని తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ఆగస్టు 4వ తేదీ ఉదయం 10 గంటల నుంచి ఆగస్టు 7వ తేదీ ఉదయం 10 గంటల వరకు 72 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తా. తెలంగాణ జాగృతి, యూపీఎఫ్ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేస్తున్నా. బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించడంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదు. రాష్ట్ర అసెంబ్లీ, కౌన్సిల్ ఆమోదించిన 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం తెలుపకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు న్యాయపోరాటం చేయడం లేదు? బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించే వరకు విశ్రమించేది లేదు, పోరాటం కొనసాగిస్తా..అని కవిత స్పష్టం చేశారు
దీక్షకు అనుమతి కోసం దరఖాస్తు..
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేపట్టబోయే 72 గంటల నిరాహార దీక్షకు అనుమతి ఇవ్వాలని జాగృతి నాయకులు దరఖాస్తు చేశారు. సెంట్రల్ జోన్ డీసీపీకి ఈ మేరకు దరఖాస్తు లేఖను అందజేశారు. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం కవిత చేపట్టబోయే నిరాహార దీక్షకు అనుమతి ఇవ్వాలని విజ్క్షప్తి చేశారు.