తెలంగాణలో కాంగ్రెస్ హవా లేనే లేదు.. ఉన్నదంతా బీఆర్ఎస్ హవానే: కల్వకుంట్ల కవిత
అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వం హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధీమా వ్యక్తం చేశారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 15 Nov 2023 8:15 AM GMTతెలంగాణలో కాంగ్రెస్ హవా లేనే లేదు.. ఉన్నదంతా బీఆర్ఎస్ హవానే: కల్వకుంట్ల కవిత
అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వం హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధీమా వ్యక్తం చేశారు. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో కూడా మునుపటికంటే ఎక్కువ స్థానాలు గెలుస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు. కవిత 2014 నుండి 2019 వరకు నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు.
బీఆర్ఎస్ హవా, కాంగ్రెస్ హవా లేదు:
తెలంగాణలో కాంగ్రెస్ “హవా” ఉందనే ప్రచారాన్ని కల్వకుంట్ల కవిత కొట్టిపారేశారు. “ఇది కేవలం చర్చ మాత్రమే.. ప్రజలు ముఖ్యమంత్రి, BRS అధినేత కె చంద్రశేఖర్ రావుపై విశ్వాసం ఉంచి BRS కు పెద్ద విజయాన్ని అందిస్తారని బలంగా నమ్ముతున్నాను. ఇక్కడ మళ్లీ BRS హవా ఉండబోతోంది" అని చెప్పుకొచ్చారు.
హ్యాట్రిక్ తప్పదు:
“మేము హ్యాట్రిక్ తప్పనిసరిగా సాధిస్తాము. అందులో ఎలాంటి సందేహం లేదు. 80 సీట్లకు పైగా గెలుస్తాం. గత ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ భారీ విజయం సాధిస్తుందని ప్రచారం చేశారు. అయితే వాస్తవాన్ని అందరూ చూశారు. వారు గెలవరు, ప్రజలు కాంగ్రెస్‌కు ఓట్లు వేయరు కూడానూ. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రం సర్వనాశనమవుతుంది. BRS 2014 నుండి రాష్ట్రంలోని అన్ని రంగాలలో మంచి ఫలితాలను చూపించింది. ప్రజలు కేసీఆర్ గారికి మూడవసారి విజయాన్ని అందిస్తారని మేము ఆశిస్తున్నాము, ”అని ఆమె న్యూస్‌మీటర్‌కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పారు. ‘‘కేసీఆర్‌లో మనకు ఒక నాయకుడు ఉన్నాడు, ఆయనే మళ్లీ సీఎం అవుతారు. మరి కాంగ్రెస్ సంగతేంటి? ఎవరు సీఎం అవుతారో వారు చెప్పగలరా? రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, జానా రెడ్డి తదితరులు చాలా మంది ఉన్నారు.
తెలంగాణ సెంటిమెంట్
తెలంగాణ సెంటిమెంట్‌పై బీఆర్‌ఎస్ కొనసాగుతోందా అని అడిగిన ప్రశ్నకు ఆమె సానుకూలంగా బదులిచ్చారు. ‘‘తెలంగాణలో తెలంగాణ సెంటిమెంట్ కొనసాగుతోంది. తెలంగాణను సాధించుకున్నాం, తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకుపోతోంది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రెండు దఫాలుగా బలమైన, సుస్థిరమైన, అభివృద్ధి ఆధారిత ప్రభుత్వాన్ని అందించారు. మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందేలా చూస్తామన్నారు.
తదుపరి టర్మ్‌లో మరిన్ని 2-బెడ్‌రూమ్ ఇళ్లు:
పేదలకు తమ ప్రభుత్వం మరిన్ని డబుల్ బెడ్ రూమ్ గదుల ఇళ్లను అందించి ఉంటే బాగుండేదని అన్నారు. “మేము ఉద్యోగాలతో పాటు, ఇళ్లకు సంబంధించిన అంశంపై కూడా దృష్టి పెడతాము. ప్రతిపక్షాల ఆరోపణలకు భిన్నంగా, ప్రభుత్వం వివిధ రంగాలలో ముఖ్యంగా ఐటీ, ఇతర పరిశ్రమలలో ఉద్యోగాలను సృష్టించగలిగింది. తెలంగాణ ప్రభుత్వం ప్రధాన కంపెనీలను ఆకర్షిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగాలు పరిమితంగా ఉన్నాయి. ఉద్యోగాల రూపకల్పనకు మేము మా వంతు ప్రయత్నం చేసాము, ” అని ఆమె వివరించారు.
కరెంట్ సమస్య లేదు:
ప్రభుత్వం గృహ, వ్యవసాయ, పారిశ్రామిక రంగాలకు తగినంత విద్యుత్‌ను అందిస్తోందని కవిత చెప్పారు. "విద్యుత్ కు సంబంధించి ఎటువంటి సమస్య లేదు," ఆమె అన్నారు.
మద్యం కుంభకోణంతో సంబంధం లేదు
బీజేపీతో రహస్య ఒప్పందం కుదుర్చుకుందనే వాదనను కూడా కవిత కొట్టిపారేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని నిలదీసినందుకే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం మద్యం కుంభకోణంలో తనను టార్గెట్ చేసిందని అన్నారు. "నేను ఇప్పటికే చెప్పాను.. మళ్ళీ చెబుతున్నాను. మద్యం కుంభకోణంతో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఇది రాజకీయంగా ప్రేరేపించబడింది,”అని కవిత నొక్కి మరీ చెప్పారు.
“ఈ అంశం నా పుట్టింటి వారికి, మెట్టినింటి వారికి చాలా బాధను, వేదనను కలిగించింది. మా అత్తగారు ఏడ్చారు. ఈ విషయంపై వచ్చిన రిపోర్టులతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. నేను ఎలాంటి విచారణనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాను. నేను ఈ ఆరోపణల నుండి బయట పడతాను. అయితే ఈ విషయంలో నేను చాలా మందికి సాఫ్ట్ టార్గెట్ అయ్యాను." అని కల్వకుంట్ల కవిత తెలిపారు.
రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలన్న కేసీఆర్ నిర్ణయానికి మద్దతు
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎన్నికలను పర్యవేక్షించేందుకు నిజామాబాద్‌లో మకాం వేసిన కవిత, గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలన్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయాన్ని సమర్థించారు.
గజ్వేల్‌లో గెలుస్తామన్న నమ్మకం లేకపోవడం వల్లనే రెండు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారని ప్రత్యర్థులు చేస్తున్న పుకార్లను ఆమె కొట్టిపారేశారు, “ఇది వ్యూహాత్మక ఎత్తుగడగా ఎందుకు భావించడం లేదు? కేసీఆర్ నిర్ణయాల వెనుక కొన్ని వ్యూహాలు ఉంటాయి. ప్రతి ఒక్క అంశం వెనుక ఒక కారణం ఉంటుంది. ” అన్నారు.
కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో ఉండడం మీకు సహాయం చేయడానికేనా అని అడిగినప్పుడు, ఆమె నవ్వుతూ, “లేదు.. లేదు.. అలాంటిదేమీ లేదు.” అని చెప్పారు
NDA, INDIA కంటే థర్డ్ ఫ్రంట్ బెటర్:
మరో ప్రశ్నకు, వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డిఎ లేదా కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి బదులుగా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి థర్డ్ ఫ్రంట్ ఉండాలని అన్నారు. “ఆ రెండు కూటములు వద్దు. మూడవ ప్రత్యామ్నాయాన్ని ఇష్టపడతాం,” అని ఆమె నవ్వుతూ బదులిచ్చారు .
హైదరాబాద్‌లో కర్ణాటక రైతుల నిరసనలకు మద్దతు:
కర్ణాటకలో సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలకు వ్యతిరేకంగా హైదరాబాద్‌లో కర్ణాటక రైతులు చేస్తున్న నిరసనలకు తమ పార్టీకి మద్దతు ఇవ్వడాన్ని కవిత సమర్థించారు. “ఇది రాజకీయం. పొరుగున ఉన్న కర్ణాటకలో కాంగ్రెస్ వైఫల్యాలను బహిర్గతం చేయడంలో తప్పు ఏముంది, వారు తమ పాలన అద్భుతమని చెబుతున్నారు.. ఇక్కడ కూడా అరచేతిలో స్వర్గాన్ని చూపిస్తూ.. వాగ్ధానాల మీద వాగ్ధానాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కర్ణాటకలో వారి వాగ్దానాలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమయ్యారు, ఇప్పుడు తెలంగాణలో ఇలాంటి వాగ్దానాలు చేసి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారు.
సీఎం కావాలనే ఆలోచన లేదు:
మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి కెటి రామారావు ముఖ్యమంత్రి పదవికి లైన్‌లో ఉన్నారని టాక్ వినిపిస్తున్నందున.. ఆమెకు కూడా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనే కోరిక ఉందా అని అడిగారు. తనకు అలాంటి పదవి ఏమీ వద్దని అన్నారు. ''వద్దు.. వద్దు.. నాకు ఇంకా చాలా కాలం ఉంది. నాకు ఇంకా వయసు చాలా తక్కువ. వరుసగా మూడోసారి గెలిచి కేసీఆర్ గారే సీఎం అవుతారు'' అని అన్నారు.