హైదరాబాద్‌లో హైడ్రా అధికారులు ఆక్రమణల తొలగింపు పేరుతో ఏకపక్షంగా కూల్చివేతలు చేపడుతున్నారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. అధికారుల తీరుతో పేదలు ఇబ్బందులు పడుతున్నారని మరోసారి ఫైర్ అయ్యారు. రోజూ వారి వ్యాపారాలు చేసుకునే వారిపై అధికారులు కూల్చివేతల పేరుతో ఇబ్బంది పెడుతున్నారని, ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. రోజు వారీ వ్యాపారం చేసుకునే వారికి, వాళ్లు చేసుకుంటేనే వారి జీవనం గడుస్తుందని, అలాంటి వారిని ఇబ్బంది పెడితే వారి శాపనార్థాలు మంచిది కాదంటూ మాట్లాడారు. రోజువారి వ్యాపారాలు చేసుకునే వారి పట్ల గతంలో ప్రభుత్వాలు వారి పట్ల మానవీయ కోణంలో వ్యవహరించాయని దానం నాగేందర్ అన్నారు. ఇరుకు రోడ్లు ఉన్న చోట ఆక్రమణలు తొలగింపు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ, చేస్తే అధికారులు మాత్రం వారికి ఇష్టమొచ్చిన చోట అడ్డగోలుగా కూల్చివేతలు చేస్తున్నారని అన్నారు.
కాగా నిన్న తన నియోజకవర్గంలో షాదాన్ కళాశాల ఎదురుగా ఫుట్‌పాత్‌ల ఆక్రమణల కూల్చివేతలను ఎమ్మెల్యే దానం నాగేందర్ అడ్డుకుని అధికారులకు వార్నింగ్ ఇచ్చారు. స్థానిక ఎమ్మెల్యేనైనా తనకు సమాచారం లేకుండా కూల్చివేతలు ఏమిటని మండిపడ్డారు. కూల్చివేతలు నిలిపివేయకుంటే రోడ్డుపైనే బైఠాయిస్తానని హెచ్చరించారు. ఇవాళ కూడా కూల్చివేతలను తప్పుబట్టిన ఎమ్మెల్యే దానం నాగేందర్ కామెంట్స్ తెలంగాణలో పాలిటిక్స్‌లో చర్చనీయాంశమయ్యాయి.